ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సుమారు 3 కిలో మీటర్ల మేర పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది.ఈ క్రమంలోనే‘దండోరా’ పేరిట కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల సారధ్యంలో హస్తం నేతలు డప్పు కొట్టుకుంటూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
https://swechaanews.com/swechaa/news/ktr-and-harish-rao-walk-to-erravalli-arrested
ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద భారీగా డప్పుల మోతతో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ ‘ఎస్సీ’ నేతలు సిద్ధమవ్వగా.. ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది.ఎర్రవెల్లి వైపు వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హస్తం నేతలు, ఆ పార్టీ శ్రేణులను నిర్బంధిస్తున్నారు. ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని తెలిసి అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఇంటికి బయల్దేరిన కేటీఆర్, హరీష్ రావు కాన్వాయ్‌లతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

https://x.com/TeluguScribe/status/2097227363813880139?s=20
హకీంపేట వద్ద వారి వాహనాలను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాము కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్నామని, నిరసనలకు కాదని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించలేదు. దీంతో కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితరులు నడుచుకుంటూనే ఫాంహౌస్ వైపు పయనమయ్యారు.ఈ క్రమంలోనే ‘ఎవడ్రా నువ్వు’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం ప్రదర్శించినట్టు సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల అహంకారపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని గులాబీ శ్రేణులు మండిపడుతున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి కాలి నడకన వెళ్తున్న కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.












