పాలనా వ్యవస్థలో కట్టుదిట్టంగా పనిచేసే నిష్పాక్షిక అధికారులపై వేధింపులకు అద్దం పట్టే సంచలన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్య తనకు జరుగుతున్న తీవ్ర అన్యాయంపై బహిరంగంగా గళమెత్తారు. కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఏకంగా నాలుగోసారి బదిలీ కావడం, అదీ కొత్త పోస్టింగ్‌లో బాధ్యతలు స్వీకరించి 50రోజులు కూడా నిండకముందే బదిలీ జాబితాలో తన పేరుండటంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యారు. కిందిస్థాయి సిబ్బంది బెదిరింపులకు గురవుతున్నానని ఫిర్యాదు చేసిన తనకే బదిలీ శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 5న మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీల ఉత్తర్వుల్లో నేహా మార్వ్యకు సంబంధించిన పలు కీలక బాధ్యతలను ప్రభుత్వం తొలగించింది. అంతకుముందు వరకు ఆమె గిరిజన ప్రాంత అభివృద్ధి పథకం డైరెక్టర్, మధ్యప్రదేశ్ ఉపాధి-శిక్షణ మండలి (MEPSET) మేనేజింగ్ డైరెక్టర్, గిరిజన పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా, ఆర్థిక కార్పొరేషన్ ఎండీగా బహుళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తాజా ఉత్తర్వుల్లో ఆమె బాధ్యతలను దారుణంగా కుదించి, కేవలం షెడ్యూల్డ్ తెగల ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా మాత్రమే పరిమితం చేయడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తనపై జరుగుతున్న ఈ వరుస వేధింపులపై నేహా మార్వ్య ఐఏఎస్ అధికారుల అధికారిక వాట్సాప్ గ్రూప్‌లో సుదీర్ఘ మెసేజ్ పెట్టి తన నిరసనను వ్యక్తం చేశారు. ‘నా అదుపులో లేని కొందరు ఉద్యోగులు నా టేబుల్‌పై చేతులు కొడుతూ బదిలీ చేయిస్తామని నేరుగా బెదిరించారు. చెప్పినట్లే కేవలం 50రోజులకే నన్ను మళ్లీ బదిలీ చేయించారు’ అని తెలిపరు. అంతేకాకుండా, అధికారులకు రక్షణగా నిలవాల్సిన ఐఏఎస్ అసోసియేషన్ తీరును ఎండగడుతూ.. ‘ఐఏఎస్ సంఘం కేవలం సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడానికే పరిమితమైందా?’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విభాగంలో కొందరు సిబ్బంది పనుల్లో అలసత్వం వహించడం, కీలక ఫైళ్లను ఆపివేయడం, దుష్ప్రవర్తనకు పాల్పడటంపై తాను ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు నేహా వెల్లడించారు. తప్పు చేసిన కిందిస్థాయి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోగా, బాధ్యతాయుతంగా పనిచేసే అధికారిని పదేపదే బదిలీ చేస్తూ నైతికంగా దెబ్బతీయడం దారుణమని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాట్సాప్ గ్రూప్ వేదికగా వేసిన ప్రశ్నలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి.












