ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు సమీపంలో కాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలపై తాజాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ విప్‌లు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను చంపేస్తామని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే మీద పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదని, ఆయన్ను ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న సైనికులమని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తాము భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దారుణాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమను అసెంబ్లీలోకి రాకుండా ఎందుకు అడ్డుకున్నారో ఇప్పటికీ స్పష్టత లేదని, దీనిపై హైకోర్టును ఆశ్రయించామన్నారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ‘ఎవరు అడ్డుకున్నారు? ఎందుకు ఆపారనే వివరాలను’ రెండు వారాల్లో సబ్మిట్ చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ లోపే బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు బనాయించారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, ప్రభుత్వ విప్‌లు, అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఎర్రవల్లి కేసీఆర్ ఫాంహౌస్ వైపు డప్పులు కొట్టుకుంటూ వెళ్లాలని పంపించడంపై జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ జరుగుతుండగా ‘విప్’లు అక్కడికి ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు.కేసీఆర్‌ను అంతమొందించేందుకే వెళ్తున్నామని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగానే వ్యాఖ్యానించారని, దానిని సుమోటోగా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ చావును కోరుతూ నిరసనలు చేపట్టిన వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని అడిగారు. ఈ తతంగం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి నిరసనకారులను పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.పోలీసులు దీనిని అడ్డుకోకపోతే ఎలా అడ్డుకోవాలో బీఆర్ఎస్ శ్రేణులకు తెలుసన్నారు. కేసీఆర్‌ను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసునని, పెద్ద సమస్యేమీ కాదన్నారు. తెలంగాణ సమాజమే ఆయన్ను కాపాడుకుంటుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












