TG : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోత కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో భారీ సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. నిరసనలో భాగంగా డప్పులు మోగిస్తూ ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వరదరాజపూర్ మీదుగా నర్సారెడ్డి ఆధ్వర్యంలో హస్తం పార్టీ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సమీపానికి చేరుకునే ప్రయత్నం చేశాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మార్గమధ్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, రోప్ పార్టీతో వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లారు. ఫామ్‌హౌస్‌కు సుమారు అర కిలోమీటర్ దూరం వరకు చేరుకుని డప్పులు మోగిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వెనక్కి తీసుకొచ్చారు. ఆందోళనకారులను నిలువరించే క్రమంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. మరోవైపు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కూడా పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అక్కడ కొద్దిసేపు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇదిలా ఉండగా మర్కుక్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా మోహరించాయి. ఫామ్‌హౌస్ సమీపంలో రైతు దీక్ష పేరుతో గులాబీ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఎర్రవల్లి, మర్కుక్ పరిసరాల్లో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యక్రమాలతో ఎర్రవల్లి ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.









