ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికత విస్తరిస్తున్నకొద్దీ ఉపాధి రంగం తీవ్రమైన ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. వివిధ నివేదికల గణాంకాల ప్రకారం ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రతి ఐదు ఉద్యోగాల్లో ఒకదానిపై ఏఐ తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. అనేక బహుళ జాతీయ సంస్థలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులపై లేఆఫ్‌ల బాణాన్ని ఉపయోగిస్తుండటంతో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే గందరగోళంగా ఉంటే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుత జనరేటివ్ ఏఐ శకం దాటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్(AGI), ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI) రూపంలో తదుపరి సాంకేతిక విప్లవం ముంచుకొస్తోంది. ఏజీఐ అందుబాటులోకి వస్తే సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో మానవ ప్రమేయంతో సంబంధం లేకుండా మానవ మేధస్సు లాగే ఆలోచించి, తప్పులను సరిదిద్దే స్థాయికి చేరుకుంటుంది. ఇప్పటివరకు కేవలం ప్రాథమిక స్థాయి (Entry Level) ఉద్యోగాలకే పరిమితమైన ఈ ముప్పు, రాబోయే రోజుల్లో అనుభవజ్ఞులైన మిడ్-లెవెల్ ఉద్యోగుల మనుగడను కూడా తీవ్రంగా సవాల్ చేయనుంది.
ఇక ఏఎస్ఐ సాంకేతికత వినోద, ఐటీ రంగాల్లో భారీ విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది. మానవ ఆలోచనలకు సంకేత రూపమిస్తే చాలు, వీఎఫ్ఎక్స్ షాట్లు, వెబ్‌సైట్ డిజైనింగ్, ప్రొడక్షన్ వర్క్స్ వంటి సంక్లిష్ట పనులను అతి తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు స్పందిస్తూ, ఆర్థిక భద్రత కోసం రాబోయే ఐదేళ్ల సమయం అత్యంత కీలకమని, భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపమే మారిపోతుంది.. అని ఎలాన్ మస్క్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ వంటి ప్రముఖులు చేసిన ఈ వ్యాఖ్యలు ఈ ముప్పు తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
సాంకేతికత ఎంత వేగంగా మారినా, ఈ సవాళ్లను తట్టుకుని నిలబడేందుకు నిరంతరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం (Up-skilling) ఒక్కటే ఏకైక మార్గమని నిపుణులు చెబుతున్నారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా తమను తాము మలుచుకునే వారికి మాత్రమే భవిష్యత్తులో అవకాశాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఊహించని ఈ సాంకేతిక విప్లవానికి సిద్ధపడకపోతే, ఉపాధి రంగంలో నిలదొక్కుకోవడం అత్యంత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.









