TG : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 9తో ముగియాల్సిన అప్లికేషన్ ప్రక్రియను మరో వారం రోజుల పాటు కొనసాగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) మంగళవారం వెల్లడించింది.
7,437 పోస్టులకు నోటిఫికేషన్
పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ జులై 29న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పలు విభాగాల్లో మొత్తం 7,437 ఖాళీలు ఉన్నాయి. వాటిలో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697 పోస్టులు ఉండగా, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052 , పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL Men) 24 , స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ 1,380 , ఫైర్ ఫైటర్ 751, జైలు వార్డర్ – 208 పోస్టులు ఉన్నాయి.
ఇప్పటికే 3.38 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్
అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో రెస్పార్స్ రావడంతో తాజాగా అప్లికేషన్ గడువును పొడిగించినట్లు తెలుస్తోంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 3,38,336 మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 2,88,530 మంది ఫీ చెల్లించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే అభ్యర్థుల ఆధార్ వెరిఫికేషన్ కూడా 95 శాతానికి పైగా పూర్తయినట్లు నియామక మండలి తెలిపింది.
లా మినిట్‌లో నో అప్లై..
దరఖాస్తు చేసుకునేందుకు ఎక్స్‌ట్రా టైం ఇచ్చిన సందర్భంగా .. చివరి రోజు వరకు వేచి చూసి లాస్ట్ మినిట్‌లో అప్లై చేసుకోవాలని చూడొద్దని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అభ్యర్థులకు ప్రత్యేకంగా సూచించింది. చివరి నిమిషంలో అప్లికేషన్ చేసుకునే క్రమంలో టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అందుకని అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటలలోపు తమ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.











