రాష్ట్రంలో రివేంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నడుమ వైరం ముదురుతోంది. నిన్న అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద జరిగిన తీవ్ర ఉద్రిక్తతలపై, తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు జరిపిన దాడిపై చర్చ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. అయితే, స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది.
ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఇవాళ శాసనసభలో క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి కాదని తెలిపారు. స్పీకర్ ఈ విషయంలో తననే అన్నారని అనుకుంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తాతా మధు నిన్న మీడియా సమావేశంలో పేర్కొన్నారని హరీశ్ రావు గుర్తుచేశారు. అయినప్పటికీ ఆయన్ను, నవీన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ రెడ్డి అరెస్టుపై తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్ అక్రమం. శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అడ్డుకుని అవమానించింది పోలీసులు, ప్రభుత్వమే.మగ ప్రజా ప్రతినిధులకు అడ్డుగా మహిళా పోలీసులను, మహిళా ప్రజాప్రతినిధులకు అడ్డుగా మగ పోలీసులను మోహరించి అడ్డుకోవడం వెనక కుట్ర దాగి ఉంది.
మహిళా ప్రజాప్రతినిధుల గొంతు నులిమి, జుట్టు, చీర లాగి అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ మీద కుట్రలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను అరెస్ట్ వెనుక కుట్ర కోణం దాగుంది’ ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.కాగా, నిన్న ఉదయం అసెంబ్లీ లోనికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్సీ తాత మధు అసభ్యపదజాలంతో దూషణ చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆ పదం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి చేసినవే అని కాంగ్రెస్ అంటున్నది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు.












