తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ రాజకీయం తీవ్ర స్థాయికి చేరింది. అసెంబ్లీ ప్రాంగణంలో చోటుచేసుకున్న నిరసనలపై రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు చీర లాగారంటూ మహిళా ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. మహిళా ఎమ్మెల్యేల చీర నిజంగా లాగారా? కొట్టారా? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.
‘సబితా ఇంద్రారెడ్డిని నిజంగా తోసింది ఎవరో అసెంబ్లీ సీసీటీవీ విజువల్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. నిరసనల పేరుతో మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రావడం ఏంటి? హరీశ్ రావు మహిళా పోలీసుల ముందు బట్టలు విప్పుతారా?’ అని తీవ్రంగా మండిపడ్డారు. సాధారణంగా మహిళా ప్రజాప్రతినిధులను సురక్షిత ప్రాంతానికి పంపి పురుష నేతలు నిరసనకు రావడం ఆనవాయితీ అని, కానీ బీఆర్ఎస్ నేతలు మహిళలను కవచంగా పెట్టుకుని చౌకబారు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారులపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చేయిచేసుకుని, దుర్భాషలాడిన దృశ్యాలు రికార్డయ్యాయని, చట్టాన్ని ఉల్లంఘించి పోలీసులపై దాడులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీతక్క డిమాండ్ చేశారు. చట్టసభలు దేవాలయం లాంటివని, బీఆర్ఎస్ మహిళా నేతలు ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. "సొంత చెల్లెలు కవితను పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు లేని బాధ, హరీశ్ రావును ఏదైనా అంటే ఎందుకు వస్తోంది?" అని బీఆర్ఎస్ అధిష్టానాన్ని సీతక్క సూటిగా నిలదీశారు.
అదేవిధంగా స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అత్యంత హేయమైన, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ఏమీ ఎరుగనట్లు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తనను ఎండగడుతూ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకపోగా, గతంలో ఎప్పుడో మరణించిన ఆయన మాతృమూర్తిని ఉద్దేశించి అంత నికృష్టమైన భాష మాట్లాడటం ఏ రకమైన సంస్కారమని సీతక్క నిలదీశారు.
అణగారిన వర్గాల నేతలు ఉన్నత పదవుల్లో ఉండటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతక్క ప్రసంగిస్తూ కంటతడి పెట్టడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సభలోనే తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో శాసనసభలో ఒక్కసారిగా అత్యంత గంభీర, ఉద్విగ్న వాతావరణం నెలకొంది.












