తెలంగాణ

‘నా తల్లిని అవమానించడంపై ఏం చెబుతారు?’.. హరీశ్‌రావును సూటిగా నిలదీసిన స్పీకర్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కూడా అత్యంత ఉద్రిక్తంగా, వాడీవేడిగా సాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల వ్యవహారం సభలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు కూడా అత్యంత ఉద్రిక్తంగా, వాడీవేడిగా సాగుతున్నాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల వ్యవహారం సభలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై అసెంబ్లీలో తీవ్రస్థాయి చర్చ జరుగుతున్న సమయంలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

 అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను పోలీసులు నెట్టివేస్తూ అమానుషంగా ప్రవర్తించారని సభ దృష్టికి తెచ్చిన హరీశ్‌రావు, సదరు పోలీసు అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. అసెంబ్లీ ప్రాంగణంలో మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక అందగానే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

 అయితే, అదే సమయంలో ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని ప్రస్తావించిన స్పీకర్ గడ్డం ప్రసాద్, తీవ్ర ఆగ్రహంతో హరీశ్‌రావును నిలదీశారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తన తల్లిని అత్యంత నీచమైన పదజాలంతో అవమానించిన అంశంపై బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారు?’ అని సూటిగా ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు, స్పీకర్ స్థానానికి జరిగిన ఈ పరాభవంపై ప్రతిపక్షం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సభాధిపతి హోదాలో గట్టిగా డిమాండ్ చేశారు.

 ఈ వివాదంలో మంత్రి సీతక్క జోక్యం చేసుకుంటూ బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ తల్లిని అంత అమానుషంగా దూషిస్తే, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ దానికి కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం తనను తీవ్రంగా బాధించిందని స్పీకర్ దుయ్యబట్టారు. అంతేకాకుండా, నిరసనల పేరుతో మహిళా పోలీసుల ఎదుట బీఆర్ఎస్ నేతలు చొక్కాలు విప్పి విసిరేసి వారిపై దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. ఒకవైపు స్పీకర్ తల్లిని అవమానిస్తూ, మరోవైపు పోలీసులపై దాడికి దిగిన బీఆర్ఎస్ తీరుపై చట్టసభ వేదికగా కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.

#TGAssembly#HarishRao#SpeakerGaddamPrasad#TataMadhu#Seethakka#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి