రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రీవెంజ్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నట్టు సమాచారం. నిన్న అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిస్థితులకు మాస్టర్ మైండ్ మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మొన్నజరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో అధికార పార్టీని రెచ్చగొట్టాలని, సమావేశాలు సజావుగా సాగకుండా చేయాలని కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే, రాష్ట్రంలో ఓవైపు హాట్‌హాట్‌గా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా మరోవైపు ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భారీగా పోలీసులు మొహరించారు. అసెంబ్లీకి రాకుండా ప్రజాధనం వేతన రూపంలో పొందుతూ ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటికి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.దీంతో కేసీఆర్ నివాస పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
కేసీఆర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరినట్టు సమాచారం.కాగా, కేసీఆర్ మీద హత్యాయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలోనే ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును కోరుకుంటున్నాం’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడి చేయడానికి కాంగ్రెస్ గుంపు బయలుదేరిందని, అందులో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఉన్నట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. ఇక కేసీఆర్ నివాసంపై దాడి చేసేందుకు గజ్వేల్ నుంచి ఎర్రవెల్లికి కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి కూడా బయలుదేరినట్టు పేర్కొన్నారు.
https://x.com/TeluguScribe/status/2097199886131450194?s=20
కాగా, కేసీఆర్ ఫాంహౌస్ చుట్టూ 144 సెక్షన్ విధించామని, ఎవరూ రావద్దని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన అధికారిక క్యాంపు కార్యాలయం నుంచి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడి కోసం తన అనుచరులతో కలిసి బయలుదేరినట్టు సమాచారం. పోలీసులే దగ్గరుండి కేసీఆర్ నివాసంపై దాడి చేయడానికి కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు.
విషయం తెలియడంతో కేటీఆర్,హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి నేరుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసానికి బయలుదేరినట్టు సమాచారం. కేసీఆర్ మీద కాంగ్రెస్ గుండాలు దాడికి ప్రయత్నిస్తున్నారని వారికి సమాచారం రావడంతో హుటాహుటిన బయదేరినట్టు వెళ్లినట్టు తెలిసింది. ఎంత మందిని పోలీసులని పంపుతారో పంపాలని, ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో రావాలని, అక్కడే తేల్చుకుంటాం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సైతం ఎర్రవల్లికి బయలుదేరినట్టు తెలుస్తోంది.












