Ysrcp: ఏపీలో త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. తాడేపల్లిలో పార్టీ చీఫ్ జగన్ అధ్యక్షతన వైసీపీ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు జగన్. వైసీపీ ప్రధాన విపక్షంగా ఉన్నా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై మండిపడ్డారు జగన్. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా శాసనసభకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు.
అసెంబ్లీకి నో, మండలికి ఓకే..
అసెంబ్లీ సమావేశాలకు నో చెప్పిన జగన్.. శాసన మండలి సమావేశాలకు మాత్రం ఓకే చెప్పారు. మండలి సమావేశాలకు హాజరు కావాలని తన పార్టీ సభ్యులకు జగన్ సూచించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వ తీరును మండలిలో ఎండగట్టాలని ఆదేశించారు. మండలి సభ్యులంతా సమావేశాలకు పూర్తి సన్నద్ధంగా ఉండాలన్నారు జగన్. ప్రజా సమస్యలపై గతంలోనూ పోరాడామన్న జగన్.. ఇప్పుడు కూడా మరింత గట్టిగా పోరాటం చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
ప్రతిపక్షం అనేది హోదా కాదు.. సంఖ్యా బలం ఉండాలి..
అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ తీసుకున్న నిర్ణయంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీకి రాని సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. 6 నెలలు అసెంబ్లీకి రాని సభ్యులపై అనర్హత వేటు వేయాలన్నారు. దీనిపై పార్లమెంటు వేదికగా చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యేల దొంగ సంతకాలను నివారించడమే లక్ష్యంగా ఫేస్ రికగ్నిషన్ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు.
ప్రజా సమస్యలను, ఆ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో చర్చించడం కోసమే ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారని స్పీకర్ అయ్యన్న గుర్తు చేశారు. మరి ఆ డ్యూటీ చేయనప్పుడు శాలరీ డిమాండ్ చేసే అధికారం ఎవరిచ్చారు? అన్నది తన పాయింట్ గా చెప్పారు. ఇక, వైసీపీ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష హోదా అంశంపైనా స్పీకర్ అయ్యన్న సీరియస్ అయ్యారు. ప్రతిపక్షం అనేది హోదా కాదన్నారు. దానికి సంఖ్యా బలం ఉండాలని చెప్పారు.
స్పీకర్ బెదిరింపులకు భయపడేది లేదు..
స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలంటే మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సిందేనని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. అది తప్ప మరో చర్చ లేదన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బెదిరింపులకు వైసీపీ భయపడదన్నారు. స్పీకర్ పరిధిలో ఉంటే తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసుకోవచ్చన్నారు బొత్స సత్యనారాయణ.












