IrumuDi Trailer Review: మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. ఆగస్టు 21న ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా నుంచి తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేయగా, ఈ ట్రైలర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈసారి రవితేజకి హిట్ గ్యారెంటీ అనేంత నమ్మకం కలుగుతోంది.
ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ-ప్రియ భవానీ శంకర్ జంటగా బేబీ నక్షత్ర వీరి కూతురు పాత్రలో నటించింది. కూతురు కోసం తండ్రి తీసుకునే కఠిన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి..ఆడపిల్లకి అన్యాయం జరిగితే హీరో ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటాడు..తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి, కూతురు కోసం అయ్యప్ప దీక్ష తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో 'ఇరుముడి' రూపొందింది.
గత చిత్రాల మాదిరిగానే దర్శకుడు శివ నిర్వాణ కుటుంబం అంతా చూసేలా కథ, కథనాలను తయారు చేశాడు. రవితేజ ఇమేజ్ కి తగ్గట్టు మాస్ అంశాలను కలకలిపి 'ఇరుముడి' చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక, హీరోయిన్‌గా ప్రియ భవానీ శంకర్ చక్కగా సరిపోయింది. ప్రతీ ఆడబిడ్డా తన కూతురే అని భావించే సన్నివేశాలను అద్భుతంగా చూపించాడు దర్శకుడు.
ఇక, ఈ సినిమాకి ప్రధాన బలం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్. సినిమా నుంచి ఇప్పటి వరకూ వచ్చిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక, తాజాగా వచ్చిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల కాలంలో రవితేజ నుంచి అభిమానులు గానీ, సినీ లవర్స్ గానీ ఆశించిన సినిమా రాలేదు. ఇప్పుడు, ఇరుముడి సినిమా రూపంలో రాబోతోంది.












