Danasari Seethakka: మహిళా సంఘాలకు రైస్ మిల్లింగ్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారామె. ధాన్యం మిల్లింగ్ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక ధాన్యం నిల్వ కేంద్రాల ఏర్పాటుకు నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించడం పట్ల మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు.
మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే అనేక రంగాల్లో ఉపాధి, ఆదాయ మార్గాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. తాజాగా ధాన్యం మిల్లింగ్, నిల్వ రంగాల్లోనూ మహిళా సంఘాలకు అవకాశం కల్పించడం ద్వారా గ్రామీణ మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయని అన్నారు.
మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూరుస్తుందన్నారు మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణాలకే పరిమితం చేయకుండా ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి అన్ని రంగాల్లో భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని తెలిపారు.
ధాన్యం నిల్వకు ప్రతి సీజన్‌లో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయించి, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక సైలో బ్యాగ్‌లు, గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం అభినందనీయమని మంత్రి సీతక్క అన్నారు.
మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆధునిక గోదాములు, మిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే మహిళలకు ఉపాధితో పాటు సంఘాలకు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర మరింత పెరుగుతుందని, మహిళా సాధికారతకు ఇది మరో ముందడుగు అవుతుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో మహిళలను ఆర్థిక స్వావలంబన చేయాలన్న ప్రజా ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సీఎం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలోని లక్షలాది మహిళా సంఘాలకు కొత్త అవకాశాలను అందిస్తున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు.












