తెలంగాణ యువతకు భారత ఆర్మీలో అవకాశాలు కల్పించడంతో పాటు, విపత్తు సమయాల్లో ఆర్మీ సహకారాన్ని మరింత విస్తృతం చేసే కీలక చర్యలకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత ఆర్మీ సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మేజర్ జనరల్ శ్రీనివాస్ రావు, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ యువతకు ఆర్మీ నియామకాల్లో మరిన్ని అవకాశాలు కల్పించే అంశంపై ఈ సందర్భంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా దేశవ్యాప్తంగా భారత ఆర్మీ నిర్వహించే వివిధ నియామకాల్లో తెలంగాణ యువతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆసక్తి, అర్హత ఉన్న యువతకు నియామక ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, శారీరక, విద్యా ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసేలా ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ ముఖ్యమంత్రి కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన.. తెలంగాణలోని ఆయా జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే అంశంపై సుముఖత వ్యక్తం చేశారు.
దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మరింత మంది యువత ఆర్మీ నియామకాలకు సన్నద్ధమయ్యే అవకాశం ఏర్పడనుంది. మరోవైపు రాష్ట్రంలో విపత్తు నిర్వహణలో ఆర్మీ పాత్రపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. ముఖ్యంగా వరదలు, భారీ వర్షాల సమయంలో రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అవసరమైన పునరావాస చర్యల్లో ఆర్మీ యంత్రాంగం మరింత చురుగ్గా వ్యవహరించాలని విన్నవించారు.
ఈ క్రమంలో లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ స్పందిస్తూ.. తెలంగాణలో విపత్తు పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రత్యేకంగా చొరవ తీసుకునేలా స్థానిక ఆర్మీ అధికారులను ఆదేశిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా సహాయం అందించేందుకు ఆర్మీ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మరోవైపు ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపైనా చర్చ జరిగింది.
హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుంచి రక్షించడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించి, మూసీ నదికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నది పునరుజ్జీవనం ఎంతో అవసరమని లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణ యువతకు ఆర్మీలో అవకాశాలు పెంచడం, జిల్లా స్థాయిలో శిక్షణ అందించడం, విపత్తు సమయాల్లో ఆర్మీ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఆర్మీ ఉన్నతాధికారుల మధ్య జరిగిన ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.












