డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేక్ లోన్ యాప్‌లతో పాటు ప్రజలను మోసం చేస్తున్న అక్రమ అప్లికేషన్లపై ఉక్కుపాదం మోపింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఏకంగా 3,718 అక్రమ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ సహా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి తొలగించి బ్లాక్ చేసింది. అధిక వడ్డీల పేరుతో దోపిడీ చేయడం, వ్యక్తిగత డేటాను చోరీ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న సైబర్ ముఠాలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో అనుమానాస్పద, నేరపూరిత కార్యకలాపాల్లో గుర్తించిన 15.75లక్షలకు పైగా సిమ్ కార్డులు, 5,77లక్షల ఐఎంఈఐ నంబర్లను పోలీసులు బ్లాక్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా సైబర్ నేరాల కట్టడి కోసం ఏర్పాటు చేసిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కు అందిన సుమారు 32.80లక్షలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించారు.
మరోవైపు నేరగాళ్ల చేతికి వెళ్లకుండా దాదాపు రూ.11,158 కోట్లను కాపాడినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వెల్లడించారు.. అలాగే చోరీ చేసిన డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తోన్న మ్యూల్ ఖాతాలపై చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. ఇక 2026 జూన్ 30 నాటికి 32.08 లక్షల అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాలను గుర్తించి, రూ.25,698 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలను అడ్డుకున్నామని కేంద్రమంత్రి వివరించారు.
పలు ప్రభుత్వ ఏజెన్సీలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.. ఇక సైబర్ మోసాలకు గురైన ప్రజలు ఇక భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.. ఆర్థిక మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఫేక్ వెబ్‌సైట్లు, మోసపూరిత యాప్‌లు, సోషల్ మీడియా నేరాలపై ఫిర్యాదు చేసేందుకు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది..
అంతేకాదు, సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఎస్‌ఎంఎస్‌లు, టీవీ, రేడియో ప్రకటనలు, డిజిటల్ మాధ్యమాల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.












