దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా మూడుసార్లు కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన బీజేపీ.. తెలంగాణలో మాత్రం ఎందుకు అనుకున్నంత స్థాయిలో పట్టు సాధించలేకపోతుంది? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయిన తమ వైఫల్యాలను పట్టించుకొక.. అవి సరి చేసుకోలేక.. మళ్ళీ రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది.
ఈ క్రమంలో అసలు బీజేపీకి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకునేంత బలం ఉందా? లేక జాతీయ స్థాయిలో ఉన్న ప్రభావాన్ని రాష్ట్ర రాజకీయాల్లోకి అనువదించుకోవాలనే ప్రయత్నమేనా? అనే ప్రశలు తలెత్తుతున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీకి ఓటు శాతం పెరిగిందని రాష్ట్ర నాయకుల ప్రచారం..
కానీ అదే బలం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు కనిపించలేదు? పార్లమెంట్‌లో గెలిచిన ఎంపీలు తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి పోటీని తట్టుకుని ఎందుకు నిలబడలేదు? ఈ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పడనుందా? ఇదే ఇప్పుడు బీజేపీ ముందున్న అసలు ప్రశ్న..
ఒకప్పుడు తెలంగాణలో అధికారానికి బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అవుతామని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానం పూర్తిగా బీజేపీకి దక్కలేదు. పైగా స్థానిక రాజకీయాల్లో సంస్థాగత బలం, గ్రామస్థాయి క్యాడర్, బలమైన స్థానిక నాయకత్వం వంటి అంశాల్లో ఇంకా బీజేపీకి సవాళ్లు ఉన్నాయని తెలుస్తుంది.
మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ తెలంగాణకు ఎంత వరకు న్యాయం చేసింది?. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ప్రాజెక్టులు తెచ్చింది? తెలంగాణ ఉద్యమంతో బీజేపీకి ఉన్న సంబంధం ఏమిటి? మొదలగు అంశాలు రాష్ట్ర ప్రజల్లో చర్చకు వస్తున్నాయి.
కేవలం నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి జాతీయ నాయకుల ఇమేజ్‌తోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను గెలవడం సాధ్యమా అన్నది కూడా మరో కీలక ప్రశ్న. మరోవైపు బీజేపీకి రాష్ట్రంలో స్వయంగా అధికారాన్ని తెచ్చేంత బలమైన నాయకత్వం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది.
కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు తమ తమ ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నప్పటికీ.. ఈ ప్రభావాన్ని మొత్తం తెలంగాణకు విస్తరించగలరా అన్నది తేలాల్సి ఉంది.
పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను అసెంబ్లీ రాజకీయాలకు నేరుగా అన్వయించుకోవడం ఎంతవరకు సరైనదో బీజేపీ నాయకత్వం ఒక్కసారి పరిశీలించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇక ఎంపీలంతా కలిసి పనిచేసినా ఎమ్మెల్యే స్థాయి రాజకీయాల్లో పార్టీకి ఎదురయ్యే పోటీ వేరు. గ్రామం నుంచి మండలం వరకు, నియోజకవర్గం నుంచి జిల్లాల వరకు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది ప్రస్తుతం బీజేపీకి అతిపెద్ద పరీక్షగా మారింది.
అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకోగలదా? ప్రభుత్వం ఇచ్చిన హామీలపై బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలదా? రైతులు, యువత, ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులు వంటి వర్గాల్లో తనకు అనుకూలమైన ఓటు బ్యాంకును సృష్టించగలదా? అనేవి బీజేపీ భవిష్యత్తును నిర్ణయించే అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కేవలం అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటేనే ప్రతిపక్షం అధికారంలోకి రాదు. ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం కేంద్ర నాయకత్వం ఇవ్వాలి. అదీగాక దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు కూడా తెలంగాణ వ్యూహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ క్రమంలో జాతీయ నాయకత్వం ఇమేజ్ తగ్గితే.. దాని ప్రభావం కూడా రాష్ట్ర ఎన్నికల్లో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగితే దాని లాభం బీజేపీకి వస్తుందా? లేక బీఆర్ఎస్ దాన్ని సొంతం చేసుకుంటుందా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ముందున్నది కేవలం ఎన్నికల గెలుపు లక్ష్యం కాదు..
ఒక రాజకీయ పరీక్ష. పార్లమెంట్‌లో వచ్చిన విజయాన్ని అసెంబ్లీ స్థాయికి తీసుకురాగలదా? జాతీయ నాయకత్వం మీద ఆధారపడకుండా రాష్ట్రంలో స్వంత నాయకత్వాన్ని నిర్మించగలదా? క్యాడర్‌ను గ్రామస్థాయిలో బలోపేతం చేయగలదా? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజల్లో నమ్మకం సంపాదించగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితేనే తెలంగాణలో కమలం వికసించే అవకాశాలపై స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
లేకపోతే పార్లమెంట్ విజయాలను అసెంబ్లీ అధికారానికి లెక్కగట్టడం రాజకీయంగా పెద్ద భ్రమగానే మిగిలిపోవచ్చని అంటున్నారు.. మొత్తంగా చూస్తే.. తెలంగాణలో బీజేపీకి అవకాశాలు లేవని చెప్పలేం. అలాగని అధికారంలోకి వచ్చేంత బలం కూడా ఉందని లెక్కలు కట్టలేమని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోల్పోయిన స్థానిక పార్టీ బీఆర్ఎస్.. అలాగే ఉన్న అధికారాన్ని నిబెట్టుకోవాలని పావులు కదుపుతున్న రేవంత్ సర్కార్.. వీళ్ళ పోరును తట్టుకుని నిలబడటం బీజేపీకి అంతా సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి రానున్న రోజుల్లో పొలిటికల్ వార్ పీక్ చేరుకుంటుందని అర్థం అవుతుంది.












