మెదక్ డీసీసీబీ చైర్మన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మెదక్ డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన చిట్టి దేవేందర్ రెడ్డి మరోసారి జూదం ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. బుధవారం ఉదయం కొంపల్లిలో కొందరు జూదం ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులు పేకాడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉన్నట్టు గుర్తించారు.
అయితే, ఆయన ఇలా పేకాటలో దొరకడం ఇది రెండోసారి అని సమాచారం. గతంలో ఆయన థాయ్ లాండ్ పర్యటనలో భాగంగా క్యాసినో ఆడుతూ దొరికారు.ఆనాడు చీకోటి ప్రవీణ్ వెంట వెళ్లి క్యాసినో ఆడుతూ దొరికిన వారిలో చిట్టి దేవేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, తాను స్నేహితులను కలవాడనికి వెళ్లాలనని, అక్కడ క్యాసినో ఆడలేదని, తన నిర్దోశిత్వాన్ని నిరూపించుకుంటానని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఈ ఘటన జరిగి మూడేండ్లు కావొచ్చింది.
తాజాగా మరోసారి జూదం ఆడుతూ చిట్టిదేవేందర్ రెడ్టి పట్టుబడటంతో ఆయనకు జూదం వ్యసనంగా మారిందని ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన్ను పోలీసులు స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.విచారణ అనంతరం పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, 2021లో చిట్టి దేవేందర్ రెడ్డి ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
కేవలం మూడేండ్ల కాలంలో లక్షా 60 వేల మంది రైతులకు ఆర్థికపరమైన సేవలను అందించడంతో పాటు బ్యాంకు లావాదేవీలను రూ.450 కోట్ల నుంచి రూ.1,650 కోట్ల వరకు విస్తరించేలా కృషి చేసిన డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డికి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. కాగా, తాజాగా రెండోసారి ఆయన వివాదంలో చిక్కుకోవడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












