పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వాయిదాలు ఆరు గందరగోళాలు అన్నట్టుగా సాగుతున్నాయి. సెషన్స్ ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు అర్థవంతమైన చర్చ జరగలేదు. నీట్ గందరగోళం, విద్యార్థులనిరసనలు, అరెస్టులు, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా తర్వాత.. కేంద్రం యాంటీ పేపర్ లీక్ తెచ్చిన విషయం తెలిసిందే.అయితే, విద్యార్థుల మీద లాఠీచార్జ్ ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? దీని మీద కేంద్రహోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు.
దీంతో పార్లమెంటులో బిల్లులు పెట్టకుండా, చర్చ జరగకుండా ఇండియా కూటమి ఎంపీలు అడ్డుకుంటున్నారు. ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియా ముందుకు వచ్చారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు మేం సిద్ధమని ప్రకటించారు. చర్చలకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని, విపక్షాలు హంగామా మాని చర్చకు ముందుకు రావాలని లోక్‌సభలో స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2:00 గంటలలోపు స్పీకర్‌కు లేఖ సమర్పిస్తే.. 3:00 గంటల నుంచే చర్చను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
పార్లమెంటరీ నిబంధనలు, ప్రక్రియల ప్రకారమే సమగ్ర చర్చ జరగాలని, కేవలం ప్రకటనలకే పరిమితం కావడం సరికాదని వెల్లడించారు.అవసరమైతే స్పీకర్ అనుమతితో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా చర్చించేందుకు మేం సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. చర్చ జరిగే సమయంలో తానే సభలో కూర్చుని, విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని రేపు మధ్యాహ్నం సమాధానం ఇస్తానని అమిత్ షా స్పష్టంచేశారు. అప్పుడే నిజానిజాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తాయన్నారు.ఇప్పుడు విపక్షాలు తేల్చుకోవాలని.. సభకు వస్తారా? ఇలాగే రాద్ధాంతం చేస్తారా? సభలో అర్థవంతమైన చర్చ కోరుకుంటున్నారా? లేక కేవలం రభస క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.












