ప్రస్తుతం రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయం నడుస్తోంది. హైదరాబాద్‌లో రూ. వందల కోట్లు విలువ చేసే భూమిని ఎటువంటి అర్హతలు లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కంపెనీకి కట్టబెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలు కీలక నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎవరూ బాగుపడొద్దా? ఆయన కుటుంబం సంపాదించుకుంటుంటే ఎందుకు ఓర్వట్లేదు. ఏదో తక్కువ పెట్టుబడితో అనుముల కుటుంబ సభ్యులు పర్మిషన్ తీసుకొని చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే రాద్దాంతం చేస్తున్నారు. అందరికి కేటాయించినట్లే అప్లికేషన్ పెట్టుకుంటే సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డికి భూమి కేటాయించారు’ అని కాంగ్రెస్ ఎంపీ చామల ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.
https://x.com/TeluguScribe/status/2087446184914780188?s=20
అయితే, టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుబడి రూ.లక్ష మాత్రమే అని... అందులో ఒక్క ఉద్యోగి కూడా లేడని.. దానికి చైర్మన్ తానేనని సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి లింక్డిన్ బయోలో పెట్టుకున్నారని.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ కీలకనేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. అయితే, కేటీఆర్ ఆరోపణలపై నిన్న ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. అసలు టెస్సరాక్ట్ కంపెనీకి సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
కానీ, తాజాగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ కంపెనీ రేవంత్ కుటుంబానిదేనని.. వాళ్లు సంపాదించుకుంటే తప్పేంటని, కేటీఆర్ ఎందుకు ఓర్వడం లేదని.. బీఆర్ఎస్ హయాంలో మీరు సంపాదించుకోలేదా? మీకో న్యాయం? రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇంకో న్యాయమా? అని ప్రశ్నలు సంధించడం తీవ్ర చర్చకు దారితీసింది.అంటే టెస్సరాక్ట్ కంపెనీ సీఎం సోదరుడు కొండల్ రెడ్డిదే అని ఎంపీ చామల అంగీకరించారా? సొంత పార్టీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పింది అబద్ధం అని తేల్చేశారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.












