అమెరికా అధ్యక్షుడిని వదలని ఇరాన్ భయం
ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేందుకు కూడా భయం భయం
అంకారాలో అసలేం జరిగింది..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన భద్రతా ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నాటో సదస్సు కోసం టర్కీలోని అంకారాకు వెళ్లిన ట్రంప్.. తిరుగు ప్రయాణంలో అందరూ ఊహించినట్లుగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వెళ్లలేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. ఆయనను మరో విమానంలోకి అత్యంత రహస్యంగా మార్చినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి.
నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ సాధారణంగా ఎయిర్‌ఫోర్స్ వన్‌లోనే బ్రిటన్‌కు బయలుదేరాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో సీన్ మొత్తం మారిపోయింది. భద్రతా కారణాలతో ట్రంప్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి బయటకు తీసుకొచ్చి.. చిన్న సైనిక విమానం సీ-32ఏలోకి తరలించారట. ఈ మొత్తం వ్యవహారం బయటకు తెలియకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహించినట్లు సమాచారం.
మీడియా ముందు విమానం ఎలా మారారు..?
ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి బయటకు రావడానికి సాధారణ మార్గాన్ని ఉపయోగించలేదు. ఎయిర్‌పోర్ట్ లోని క్యాటరింగ్ వాహనం ద్వారా ఆయనను రహస్యంగా తరలించినట్లు అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. బయటకు చూస్తే అది సాధారణంగా విమానానికి ఆహారం, ఇతర సామగ్రి తరలించే వాహనంలాగే కనిపించింది. కానీ అదే వాహనం ట్రంప్‌ను మరో విమానం వద్దకు తీసుకెళ్లింది.
అసలు ఎందుకీ రహస్య తరలింపు..?
ఈ ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడే ఇప్పుడు సమాధానం ఇచ్చారు. తనను విమానం మార్చాలని సీక్రెట్ సర్వీస్, సైనిక అధికారులు సూచించారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉండొచ్చన్న భద్రతా హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తాను ఎలాంటి ప్రమాద వివరాలను లోతుగా అడగలేదని, భద్రతా అధికారులు చెప్పిన సూచనలను పాటించానని ట్రంప్ పేర్కొన్నారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎయిర్‌ఫోర్స్ వన్ మాత్రం తన ప్రయాణాన్ని కొనసాగించింది. అంటే ట్రంప్ అందులోనే ఉన్నారనే భావన బయట ప్రపంచంలో కొనసాగుతుండగా.. ఆయన మాత్రం మరో విమానంలో రహస్యంగా ప్రయాణించారు. ఈ విధంగా ఒక విమానాన్ని డికాయ్‌గా ఉపయోగించడం వల్ల ట్రంప్ అసలు ఎక్కడ ఉన్నారన్న విషయం బయటపడకుండా చూడగలిగారు.
అయితే ఈ ఘటన ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అధ్యక్షుడి భద్రత కోసం ఇలాంటి రహస్య ఆపరేషన్ అవసరమే అయినప్పటికీ.. ఆయన వెంట ప్రయాణిస్తున్న జర్నలిస్టులు, సిబ్బందికి కూడా పూర్తి సమాచారం లేకపోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భద్రత ఒకవైపు.. పారదర్శకత మరోవైపు అన్న చర్చ మొదలైంది.
ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో ప్రయాణించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను.. ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ వాహనం ద్వారా మరో సైనిక విమానంలోకి మార్చడం మాత్రం అసాధారణ ఘటనగానే నిలిచింది. భద్రతా కారణాలతో ఈ ఆపరేషన్ జరిగిందని ట్రంప్ స్పష్టం చేసినప్పటికీ.. అసలు ముప్పు ఎంత తీవ్రమైనది? ఇంతటి రహస్య చర్య ఎందుకు అవసరమైంది? అనే ప్రశ్నలు మాత్రం ఇప్పుడు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.












