ఓవైపు డీఎంకే.. మరోవైపు అన్నా డీఎంకే
త్రిషను టార్గెట్ చేస్తూ కామెంట్లు
రసవత్తరంగా అరవ రాజకీయం
త్రిష చుట్టే తమిళ్ పాలిటిక్స్
తమిళనాడు రాజకీయాల్లో ఈ మధ్య ఒక పేరు పదేపదే వినిపిస్తోంది. అయితే అది ఏ రాజకీయ నాయకుడిదో కాదు.. సీఎం విజయ్‌ది కూడా కాదు. ఆ పేరు సినీనటి త్రిషది. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతల రాజకీయ వ్యాఖ్యల్లోనూ త్రిష ప్రస్తావన రావడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష పేరు రాజకీయాల్లో వినిపించడం మరింత ఎక్కువైంది. తాజాగా అన్నాడీఎంకే నేత ఆర్‌బీ ఉదయకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది.
ఉదయ్‌కుమార్ ఏమన్నారు..?
రెండ్రోజుల కిందట తూత్తుకుడిలో జరిగిన అన్నాడీఎంకే కార్యక్రమంలో మాట్లాడిన ఆర్‌బీ ఉదయకుమార్.. సీఎం విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని త్రిష ప్రస్తావన తీసుకొచ్చారు. విజయ్‌కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ అంశంపై మాట్లాడుతున్న సమయంలో త్రిష పేరును ప్రస్తావించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్రిష అభిమానులు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. మదురైలో ఆమె అభిమాన సంఘం ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టర్లు అంటించింది.
ఇదే ఫస్ట్ కాదు.. లాస్ట్ కూడా కాబోదు!
త్రిష పేరును తమిళ రాజకీయాల్లోకి తీసుకురావడం మొదటిసారి కాదు. గతంలోనూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కావేరి జలాల అంశంపై జరిగిన నిరసన కార్యక్రమంలో కొందరు త్రిష పేరుతో నినాదాలు చేసిన సమయంలో ఉదయనిధి స్పందించిన తీరు వివాదాస్పదమైంది. ఆయన డబుల్ మీనింగ్ డైలాగులు చేశారంటూ విమర్శలు వచ్చాయి. అయితే తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఉదయనిధి స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే కూడా వివరణ ఇచ్చింది. మరోవైపు టీవీకే మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఆ రోజు ఉదయనిధి స్టాలిన్‌ను అరెస్ట్ చేయడం, వదిలిపెట్టడం పెద్ద దుమారాన్నే లేపింది.
గతంలో విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతల వ్యాఖ్యల్లోనూ త్రిష పేరు వినిపించింది. ఎన్నికల కంటే ముందు తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్నే సృష్టించాయి. విజయ్ రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి.. అంటూ వ్యాఖ్యానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో విజయ్‌ను రాజకీయంగా విమర్శించేందుకు త్రిష పేరును ఉపయోగిస్తున్నారా అనే చర్చ అప్పుడే మొదలైంది.
త్రిషకు రాజకీయాలతో ఏం సంబంధం..?
అసలు త్రిషకు రాజకీయాలతో సంబంధం ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. త్రిష రాజకీయ పార్టీకి నాయకురాలు కాదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఆమె పేరు మాత్రం తమిళనాడు రాజకీయాల్లో పదేపదే వినిపిస్తోంది. ముఖ్యంగా విజయ్‌ను టార్గెట్ చేసే సందర్భాల్లో త్రిష ప్రస్తావన రావడం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.
విజయ్ తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతోనే అక్కడి సంప్రదాయ రాజకీయ సమీకరణాలను మార్చే ప్రయత్నంగా కనిపించింది. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ను టార్గెట్ చేయడానికి త్రిష పేరే ఎందుకు ఉపయోగిస్తున్నారు అనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. త్రిష పేరు ప్రస్తావించడం ద్వారా విజయ్‌పై రాజకీయంగా ప్రభావం చూపించవచ్చని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయా? లేక రాజకీయ సభల్లో సంచలనం కోసం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా?
మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు అసలు రాజకీయ సమస్యలను పక్కకు నెట్టేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. కావేరి జలాల సమస్య, ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై రాజకీయ చర్చ జరగాల్సిన సమయంలో.. ఒక సినీనటి పేరు చుట్టూ వివాదం తిరగడం రాజకీయ సంస్కృతిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడులో త్రిష ఇప్పుడు కేవలం సినీనటి కాదు.. రాజకీయ విమర్శల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. డీఎంకే నేత వ్యాఖ్యలు, అన్నాడీఎంకే నేత తాజా కామెంట్లు, గతంలో బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు.. ఇవన్నీ కలిపి చూస్తే త్రిష చుట్టూ రాజకీయ చర్చ ఒక ప్రత్యేక కోణాన్ని సంతరించుకుంది.












