హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం ఉదయం ఈగల్ బృందాలు దాడులు నిర్వహించాయి. పోలీసులు సైతం వారి వెంట ఉన్నారు. మత్తు పదార్థాలు వాడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో ఈగల్, పోలీసు బృందాలు సంయుక్తంగా దాడులు జరిపినట్టు సమాచారం.గత కొంతకాలంగా యూనివర్సిటీలో అసాంఘిక చర్యలు, కార్యక్రమాలకు కొందరు విద్యార్థులు పూనుకున్నారని తెలిసింది. దీంతో ఈగల్ బృందాలు రంగంలోకి దిగాయి.
క్యాంపస్‌లో డ్రగ్స్ సేవించడం, విక్రయించడం జరుగుతోందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు అనుమానం వచ్చిన పలువురు విద్యార్థులకు పట్టుకుని వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఇద్దరికి పాజిటివ్ రాగా.. మరో 15 మంది అనుమానితులుగా ఉన్నట్టు సమాచారం. వారికి కూడా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.దీంతో వర్సిటీ పరిధిలో అక్రమంగా మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మత్తు పదార్థాలను అస్సాం నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రాము గంజాయిని రూ.500లకు విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం యూనివర్సిటీ ప్రాంగణంలో ఈగల్ బృందాల దాడులు కొనసాగుతున్నాయి. మరికొంత మందికి పరీక్షలు చేయాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. వర్సిటీలో ఎక్కడ గంజాయి సరఫరా జరుగుతోంది? ఏ సమయాల్లో విక్రయిస్తున్నారు? బయటి వ్యక్తులు ఇంకా ఎవరైనా వచ్చి అమ్ముతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయడంతో పాటు.. వర్సిటీ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందిని సైతం అధికారులు విచారించనున్నట్టు సమాచారం.












