సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చాలా మంది అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కొనేటప్పుడు బాగానే ఉన్నా తిరిగి అప్పు చెల్లించే క్రమంలో ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు సర్దుబాటుకాక వాటిని తీర్చడానికి మరల అప్పులు చేస్తున్నారు. దీంతో అప్పులు కాస్త మెడకు ఊరితాడై వేలాడుతోంది. ముందు చూపు లేకుండా చేసిన అప్పులు తల్లిదండ్రులను బలిగొంటుంటే వారి సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. తీసుకున్న అప్పులు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖలో నరేష్(38) అనే వ్యక్తి జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనతో పాటు భార్య మేఘన(34) పిల్లలు అయాన్ష్(9), మిథున్(7)లతో కలిసి నివసిస్తున్నారు.కొన్ని నెలల క్రితం రూ.90 లక్షలు అప్పు చేసి నరేష్ దంపతులు సొంత ఇల్లు కొనుక్కున్నారు.
ఇంటిపై రుణం వస్తే అప్పు తీర్చేద్దాం అనుకున్నారు కానీ, రుణం రాకపోవడంతో ఇల్లు అమ్మేసి కొంత అప్పు తీర్చారు.ఇంకా మిగిలి ఉన్న అప్పు గురించి నరేష్ ఆందోళనలో ఉన్నట్టు, మానసిక వైద్యుడి వద్ద చికిత్స కూడా తీసుకుంటున్నట్టు బంధువులు తెలిపారు.ఈ నేపథ్యంలో పిల్లలు స్కూల్‌కు వెళ్లగానే ఉరివేసుకుని నరేశ్ ఆత్మహత్య చేసుకోగా..పురుగుల మందు తాగి మేఘన కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
https://x.com/TeluguScribe/status/2087394480160919643?s=20
సమాచారం అందుకున్న బంధువులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద ఏం జరిగిందో తెలియక మౌనంగా కూర్చున్న చిన్నారుల దృశ్యం అందరినీ కలిచివేసింది.












