- మనోవేదనలో రియల్టర్స్, పార్టీ నేతలు?
- ముఖ్యనేత బంధువులతో అవుతాయని కొందరు?
- అనుచరుల వద్ద ఇంకొందరు?
- మంత్రితోనే అవుతుందని మరికొందరు?
- అగ్రిమెంట్లు చేయించినా , పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు
- అడ్వాన్సులు ఇచ్చి చెప్పులు అరిగేలా తిరుగుతున్న వైనం
- ఏ చిన్న పనైనా బీఆర్ఎస్ కు లీకులు?
- మీడియాలో కథనాలతో చేసుకున్న పని కంటే బద్నాం ఎక్కువ?
-ఈ ప్రభుత్వంలో పనులు అయ్యేనా అంటూ అనుమానాలు?
- ఎటూ చెప్పుకోలేక మధనపడుతున్న వారిపై స్వేచ్ఛ స్పెషల్ స్టోరీ
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ చైర్మన్
ఎమ్మెల్యేలు కూడా బాధితులే.. మొదట్లో హడావుడి..ఇప్పుడంత ఈజీ కాదు?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ లో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఫైల్స్ పట్టుకుని తిరుగుతున్నారు. మళ్లీ ఎన్నికలకు రెడీ కావాలంటే ఆదాయ మార్గం ఇదొక్కటేనని పనులు అయ్యే వారి వద్దకు ఫైల్స్ తీసుకెళ్లారు. కొంత అడ్వాన్సులు ఇప్పించడం, ఇంకొంత మంది వాటాలు రాసి ఇచ్చారని సమాచారం. అలాగే ఇలాంటి భూములను వెతుక్కుని పెట్టుబడి పెట్టి అధికారులతో క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు.
హైదరాబాద్ , చుట్టుపక్కల భూముల్లో కలెక్టర్లు ముఖ్యనేత సోదరుడి మాట వింటారని ఏడాదిన్నరగా ఆయన వద్ద ఫైల్స్ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మేల్యేలు తిరుగుతుండటంతో తమకు కూడా పనులు అవుతాయని రియల్టర్స్ కూడా పెద్ద ఎత్తున వివాదాస్పద భూముల్లో తల దూర్చినట్టు వాళ్లే చెబుతున్నారు. మొదట్లో కొన్ని స్థలాలు పొజిషన్ తీసుకోగల్గినా, ఇంకొన్నింటిని రికార్డుల్లో మార్చేసినా, ఇంకా ఫైనల్ గా పనులు పూర్తి కాలేదని వాపోతున్నారు.
కాంప్రమైజ్డ్ గా రైతుల ఒప్పందాలతో పూర్తి చేశారని తెలుస్తోంది. అది చూసి మరిన్నింటిని క్లియర్ చేస్తారని అనుకున్న వారు పెద్ద ఎత్తున ఇరుకున్నట్లు సమాచారం. తాజాగా 3 నెలల నుంచి భూములపై వాళ్లు చెప్పింది నడవడం లేదని, అడ్డగోలుగా రికార్డులు మార్చేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదని గ్రహించడంతో ఇచ్చిన అడ్వాన్సుల కోసం సోదరుల చుట్టు తిరుగుతున్నట్లు నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించాయి.
మొహమాటానికి ధైర్యం చేసి గట్టిగా అడగలేకపోతున్నా, లోలోపల ఆర్ధిక కష్టాలతో కొద్ది రోజుల్లోనే కోపం కట్టలు తెంచుకుని మీడియా ముందుకు వచ్చేందుకు కూడా సిద్దమవుతున్నరని సమాచారం. మరోవైపు అగ్రిమెంట్లు చేసుకున్న ఫైల్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇలా దిక్కుతోచని పరిస్థితిలో రియల్టర్స్, కొంత మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని సమాచారం..
అంతర్గత పొరుతో ప్రతిపక్షాలకు సమాచారం
ఇటీవల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వందల కోట్ల అప్పులను చెల్లించారు. అందుకు ఆయనకు ఉన్న భూములను డెవలప్మెంట్ కి ఇవ్వడంతో పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి. దీనికి తోడుగా ఆరోగ్యం కూడా సహాకరించకపోవడంతో అప్పులు ఉన్న వారందరిని పిలిచి క్లియర్ చేశారని వార్తలు వచ్చాయి. అలాగే ఆయనకు అప్పు ఇస్తే జీవిత కాలంలో రావనే ప్రచారం ఉండేది. అలాంటిది అందరికి గుర్తు పెట్టుకుని మరి క్లియర్ చేయడంతో ఆశ్చర్యానికి గురయ్యారైనట్టు సమాచారం..
అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలే బ్యాంకు అప్పు డీటెయిల్స్ ప్రతిపక్షాలకు ఇవ్వడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి వివరించుకున్నారట.. ఇలా అనేక భూముల విషయంలో ప్రతిపక్షాల వద్ద నిత్యం సమాచారం ఉంటుంది. సీఎం సొంత సోదరుడికి భూమి కేటాయించారని పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తున్నారు. బంధువులకు , వారి బినామీలకు కూడా ప్రభుత్వం భూములు కేటాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
అలాగే ఈ విషయాలన్నీ బయటికి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది.. ఇక కోట్ల రూపాయల భూములు తక్కువకు కట్టబెట్టినట్టు ప్రస్తుత ప్రభుత్వం పై ఆరోపణలున్నాయి.. ముఖ్యంగా కోండల్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలు వార్తలుగా వస్తున్న క్రమంలో.. తమపై కూడా ఇలానే వస్తాయనే భయంలో కూడా కొంత మంది బిజినెస్ మెన్స్ వెనకడుకు వేస్తున్నట్టు తెలుస్తుంది.
మరోవైపు వంశీరాం, అపర్ణ, డీఎస్సార్, ఫినిక్స్ లాంటి టాప్ 10 రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా గతంలో లాభపడ్డా, ఇప్పుడు లబ్ది పొందితే సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది. దీంతో ప్రతిపక్షాలు భూ వ్యవహారంలో పట్టు సాధించి అడ్డుకుంటున్నారు.
ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారిన వ్యవహారాలు
ఏ పనినైనా మూడో కంటికి తెలియకుండా గత ప్రభుత్వాలు చేపట్టేవని, పనులు పూర్తయిన తర్వాతే వాటి వివరాలు బయటకు వచ్చేవని ఒక అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పనులు ప్రారంభం కాకముందే వాటిపై ప్రచారం మొదలవుతోంది. పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలో స్పష్టత లేకపోవడం, చేయాల్సిన పనులను పక్కన పెట్టడం, చేయలేని పనులను కూడా చేస్తామని హామీలు ఇవ్వడం చివరకు ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ముఖ్యనేతకు సన్నిహితంగా ఉండే నలుగురు అనుచరులపై కూడా పలు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ అధికారులు కూడా వారి ముందు ఒకలా, బయట వ్యక్తులతో మరోలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో అంతర్గతంగా జరిగే వ్యవహారాలకు సంబంధించిన పిన్ టు పిన్ సమాచారం బయటకు వస్తోందన్న చర్చ సాగుతోంది. మొత్తంగా చూస్తే.. పనులు మొదలుపెట్టకముందే ప్రచారం చేయడం, ఆ తర్వాత వాటిని అమలు చేయలేకపోవడం ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు తలనొప్పిగా మారుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ మంత్రి వద్ద విచిత్ర పరిస్థితి?
రెవెన్యూ లో పట్టున్న ఓ అధికారి పనులు అవుతాయో కావో నిర్ణయిస్తారు. రికార్డుల్లో అంతా బాగానే కనిపించినా కోర్టుల్లో కేసులు, తీర్పులు అప్డేట్ కాకపోవడం రికార్డుల్లో మార్చుకున్నా స్టేలతో మిగిలిపోతున్నాయి. ఇలాంటి సమస్యలతో ఆయన వద్దకు వెళ్లితే ఆస్తులు అమ్ముకోవాల్సిందేననే ప్రచారం ఉంది. ఆ మంత్రి మొహమాటం లేకుండా వాటాలు అడుగుతున్నారని కొందరు వాపోతున్నారు.
మరోవైపు పని పూర్తి అవుతుందని గ్యారెంటీ లేదని గత అనుభవదారులు చెబుతుండటంతో ఆ మంత్రికి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారితే.. ఎన్ని కేసులు వేస్తారోనని ఇల్లీగల్ గా పనులు చేసుకుంటున్న వారు లోలోపల భయపడుతున్నట్టు సమాచారం..
మొత్తానికి ఎంతోమంది రియల్టర్లు, కాంగ్రెస్ నేతలు ఈ వ్యవహారంలో తాము మధ్యలో ఇరుక్కుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి, గజాల లెక్కన విక్రయిస్తున్న ఎమ్మెల్యేల రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించడమే. దీంతో దాదాపు 90 శాతం మంది ఎమ్మెల్యేలు తమ పెట్టుబడులకు రియల్ ఎస్టేట్‌నే ప్రధాన ఆధారంగా చేసుకుని వ్యూహాలు రూపొందించుకుంటున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.












