Telangana RERA: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా-TG RERA రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి చట్టం) కొరడా ఝళిపించింది. నిబంధనలు ఉల్లంఘించిన 4 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై భారీ జరిమానాలు విధించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయాలు చేపట్టిన AV Infracon Pvt Ltv కు చెందిన AVs East Residency ప్రాజెక్ట్ పై 2లక్షల 83వేల 140 రూపాయల ఫైన్ వేసింది. AVs West Heights ప్రాజెక్ట్ పై రూ.14,84,184 జరిమానా విధించింది. మరోవైపు సేల్ అగ్రిమెంట్ చేయకుండా 25శాతం డబ్బులు వసూలు చేసిన అదూరి ఇన్ ఫ్రాకు రూ.6,77,966 భారీ జరిమానా విధించింది.
రెరా చట్టం ప్రకారం సేల్ అగ్రిమెంట్ చేయకుండా కొనుగోలుదారుల నుంచి అగ్రిమెంట్ మొత్తం విలువలో 10శాతం కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేయరాదు. ఇక రెరా రిజిస్ట్రేషన్, హెచ్ఎండీఏ అనుమతులు పొందకుండా విక్రయాలు చేపట్టిన SVM Aditya Homes కు చెందిన టెక్ హోమ్స్ ప్రాజెక్ట్ పై రూ.43,16,480 భారీ జరిమానా విధించింది రెరా అథారిటీ.
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయడం, బుకింగ్ తీసుకోవడం లేదా విక్రయాలు చేపట్టే ముందు తప్పనిసరిగా ప్రాజెక్ట్ రెరా రిజిస్ట్రేషన్ పొందాలని, అలాగే సేల్ అగ్రిమెంట్ చేయకుండా కొనుగోలుదారుల నుంచి అగ్రిమెంట్ మొత్తం విలువ 10శాతం కంటే ఎక్కువ డబ్బు వసూలు చేయొద్దని రెరా అథారిటీ పేర్కొంది.
తప్పనిసరి రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మకాలు చేపట్టడం, అమ్మకపు ఒప్పందాలు చేసుకోకుండా అనుమతించదగిన పరిమితికి మించి మొత్తాలను వసూలు చేయడం వంటి రెరా చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు.. నాలుగు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై భారీ జరిమానాలు విధించినట్లు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తెలిపింది.












