దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన సుమారు 20 వేల పేజీల సమగ్ర ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ పరిగణనలోకి తీసుకుంది.
ఈ కేసులో 13 మంది ప్రధాన నిందితులపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు లోపాలు, అక్రమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను కూడా ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
కేసును విస్తృతంగా దర్యాప్తు చేసిన సీబీఐ.. నిందితులపై అభియోగాలను బలపరిచేందుకు భారీ స్థాయిలో ఆధారాలను కోర్టు ముందుంచింది. ఛార్జ్‌షీట్‌తో పాటు 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక పత్రాలు, 43 డిజిటల్ ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించింది. ఇక పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఒక్కో ప్రశ్నాపత్రానికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ అంశంపై రేపు రౌస్ అవెన్యూ కోర్టులో కీలక వాదనలు జరగనున్నాయి.
నిందితుల పాత్రను సీబీఐ తరఫు న్యాయవాదులు వివరిస్తే విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉంది. మరోవైపు లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు NEET-UG పేపర్ లీక్ కేసులో సీబీఐ ఛార్జ్‌షీట్ సంచలన విషయాలను బయటపెట్టింది. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి డీలక్స్ రూమ్‌ను ఏకంగా స్పెషల్ సీక్రెట్ క్లాస్‌రూమ్ గా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
అక్కడ NTAకి చెందిన కెమిస్ట్రీ నిపుణుడు ప్రహ్లాద్ కులకర్ణి.. ప్రశ్నాపత్రంతో వచ్చి 132 ప్రశ్నలు, వాటి సమాధానాలను ఓ విద్యార్థితో నోట్‌బుక్‌లో రాయించినట్లు సీబీఐ పేర్కొంది.
ఏప్రిల్ 18, 19, 22 తేదీల్లో గంటల తరబడి ఈ రహస్య తరగతులు జరిగినట్లు తెలిపింది. పరీక్ష తర్వాత ఆ నోట్‌బుక్‌ను పాత సామాన్లు కొనే వ్యక్తికి విక్రయించినట్లు విద్యార్థి సీబీఐకి చెప్పడం ఈ కేసులో మరో సంచలనంగా మారింది.
అలాగే సదరు ఆస్పత్రి ఓనర్ మనోజ్ శిరూరే అక్కడి రాగా పేపర్ లీక్‌లో ఆయన కూడా కీలక పాత్ర పోషించినట్లుగా విచారణలో వెల్లడైంది. మొత్తంగా ఈ ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఎవిడెన్స్‌పై కోర్టులో జరిగే తదుపరి విచారణ ఈ కేసులో కీలకంగా మారనుంది.












