Cm Revanth Reddy: రైస్ మిల్లర్ల గోల్ మాల్ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదని మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా డీఫాల్ట్ అయిన మిల్లులను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న మిల్లులను మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. డీఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాలని రేవంత్ ఆదేశించారు. బకాయిల వసూలుకు ప్రత్యేక విధానం రూపొందించాలన్నారు. ఉద్దేశపూర్వక డీఫాల్ట్ మిల్లులను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ చెప్పారు. 5 నియోజకవర్గాల్లో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలన్న ముఖ్యమంత్రి రేవంత్.. ప్రతి జిల్లాకి నోడల్ అధికారిని నియమించాలని చెప్పారు.
రైస్ మిల్లర్ల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ చాలా రోజులుగా సీరియస్ గా ఉన్నారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా మిల్లర్లు కొన్ని సమస్యలు సృష్టించారని, రైతులను కొంత గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేశారని ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో పాటు మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యాన్ని తిరిగి ఇచ్చే క్రమంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. డీఫాల్టర్ గా చూపించుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండికొట్టే ప్రయత్నాలు చేసిన మిల్లర్లకు సంబంధించిన వ్యవహారంపైనా సర్కార్ ఆగ్రహంగా ఉంది.
ఇవాళ సివిల్ సప్లైస్ శాఖపై సమీక్ష సందర్భంగా పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావించారు. మిల్లర్లు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి మిల్లర్లను సహించేది లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా డీఫాల్టర్ గా చూపించే ప్రయత్నం చేసిన మిల్లులను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్. స్వాధీనం చేసుకున్న ఆ మిల్లులను నేరుగా మహిళా సంఘాలకు అప్పగించాలని, వారి నుంచే ధాన్యాన్ని తీసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లుగా ఈ సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.












