తెలంగాణ

Nandini Mallu: వివాదంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి.. లంచం అడిగారని గవర్నర్ కు ఫిర్యాదు

రచన: NK••3 నిమిషాల పఠనం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై లంచం ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి నందిని 10శాతం లంచం అడిగారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. భట్టి విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

Nandini Mallu: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై లంచం ఆరోపణలు వచ్చాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి నందిని 10శాతం లంచం అడిగారని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఆ ఆరోపణల ఆధారంగా భట్టి విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతల రేవంత్.

ఉప ముఖ్యమంత్రి భట్టి భార్యపై వచ్చిన లంచం ఆరోపణలపై సమగ్రంగా, పారదర్శకంగా, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు కాపీలను సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్రం కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు మెయిల్ ద్వారా పంపినట్లు న్యాయవాది తెలిపారు.

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకురాలు ప్రసన్నకుమారి చేసిన ఆరోపణల ఆధారంగానే ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు న్యాయవాది రేవంత్ తెలిపారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద రావాల్సిన సుమారు రూ.40 లక్షల మొత్తాన్ని విడుదల చేయడానికి డిప్యూటీ సీఎం భార్య.. 10 శాతం చొప్పున రూ. 4 లక్షల కమిషన్ డిమాండ్ చేశారని ప్రసన్నకుమారి తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారాయన.

వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 120 కోట్ల రూపాయల బిల్లుల క్లియరెన్స్ కు కూడా 6 శాతం నుంచి 10 శాతం వరకు కమిషన్లు వసూలు చేసేందుకు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం భార్యపై లంచం ఆరోపణలు వచ్చిన వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

#Nandini Mallu#Mallu Bhatti Vikramarka#Deputy Chief Minister#Telangana#Bribe#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి