ప్రతి హిందువు ఇంట్లో తులసి మొక్క ఉండటం సర్వ సాధారణమే.. ఇది కేవలం ఒక సంప్రదాయం కాదు. మనిషి జీవితాన్ని ప్రకృతితో, ప్రకృతిని దైవంతో అనుసంధానం చేసే ఒక ఆధ్యాత్మిక భావన. అందుకే తులసిని భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా, లక్ష్మీదేవి స్వరూపంగా, శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. అందుకే తులసి దగ్గర చేసే ప్రతి ఆచారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి..
అందుకే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలతో పవిత్రమైన మనసుతో తులసి మొక్కకు నమస్కరించి పూజ ప్రారంభించాలని పండితులు చెబుతున్నారు. అలాగే తులసి మాటకు పసుపు, కుంకుమ సమర్పించి, దీపం వెలిగించి, ప్రదక్షిణ చేయడం సంప్రదాయం. వీలైతే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం తులస్యై నమః వంటి ఈ మంత్రాలను జపిస్తూ పూజ చేస్తే శుభప్రదమని అంటున్నారు.
ఇక తులసికి నీళ్లు ఎప్పుడు పోయాలన్నది కూడా ముఖ్యమే. సాధారణంగా ఉదయం సూర్యోదయం తర్వాత నీరు పోయడం మంచిదిగా భావిస్తారు. అయితే మట్టిలో ఇప్పటికే తేమ ఉంటే ప్రతిరోజూ ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు. మొక్క ఆరోగ్యంగా ఉండేందుకు నీటి పరిమాణం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, వంటి రోజుల్లో తులసికి నీరు పోయకూడదని కొన్ని సంప్రదాయాల్లో చెబుతారు. అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు కోయకూడదు. ద్వాదశి రోజున తులసి దళాలను కోయకుండా ఉండటం వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారంగా పేర్కొంటారు.
ఇక కార్తీక మాసంలో తులసి పూజకు మరింత విశిష్టత ఉంది. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించడం, నైవేద్యం సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం భక్తితో చేసే ఆచారాలు. అయితే తులసి పూజలో అసలు ముఖ్యమైనది ఆచారం కంటే భక్తి, శుభ్రత, నియమం. మొక్కకు నీళ్లు పోసేటప్పుడు మనలో కూడా మంచి ఆలోచనలకు నీరు పోస్తున్నామనే భావన ఉండాలని ఆథ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
మరోవైపు తులసి మన ఇంటి ఆవరణలో ఉండే ఒక మొక్క మాత్రమే కాదు.. ప్రకృతిని పూజించే భారతీయ సంస్కృతికి ప్రతీక. అందుకే తులసిని పూజించడం అంటే మొక్కను మాత్రమే కాదు.. జీవాన్ని, ప్రకృతిని, దైవత్వాన్ని గౌరవించడం కూడా అని చెబుతున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












