వాతావరణంలో మార్పులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పాలిట ప్రస్తుతం శాపంగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అరకొరగా కురుస్తున్న వర్షాలతో భూమిలోపల ఉత్పన్నం అవుతున్న వేడి వల్ల పాములు జన సంచారంలోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కాలంలో పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం వల్ల పిచ్చి మొక్కలు, చెట్లు, గడ్డి పొదలు పెరగడం పాములకు, తేళ్లకు, జెర్రిలకు ఆవాసాలుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాముల సంచారం ప్రజలను, ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ కార్యాలయాలు, నివాస ప్రాంతాల్లోకి విషసర్పాలు చొరబడుతుండటంతో.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
ఇటీవల నారాయణపేట మండలంలో పాముకాటుకు గురై మూడో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు దేవరకద్ర గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థి కూడా విషసర్పం కాటుకు గురై మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఊట్కూరు సహా పలు మండలాల్లోని పాఠశాలల ప్రాంగణాల్లో పాములు కనిపిస్తుండటంతో.. పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు వణికిపోతున్నారు..
వరుస ఘటనల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పాఠశాలలు, హాస్టళ్ల పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండేలా మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు. మరోవైపు పాములు ఉండే బొరియల్లోకి నీరు చేరడం, వర్షాల మధ్య ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల పాములు బయటకు వస్తున్నాయని, ప్రస్తుతం పాముల సంచారం ఎక్కువగా ఉండే కాలం కావడంతో.. ఆహారం, జత కోసం అవి కొత్త ప్రాంతాలకు చేరుతున్నాయని అధికారులు అంటున్నారు.
అదేవిధంగా వర్షపు నీరు నిలిచిన చోట కప్పలు, ఇతర జీవులు చేరుతుండటంతో.. వాటిని తినడానికి బయటికి వచ్చే పాములు.. చెత్తాచెదారం, పొదలు, తడిగా ఉండే ప్రాంతాల ద్వారా జనావాసాల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. అందుకే పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్ల పరిసరాల్లో నీరు నిలవకుండా చూడాలి. చెత్తాచెదారం, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. విద్యార్థులకు పాముల రకాలు, వాటి ప్రవర్తన, పాముకాటుకు సంబంధించిన ప్రాథమిక అవగాహన కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు.


