కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లోని లేహ్ ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 6:05 గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5తీవ్రతతో నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్) అధికారికంగా ధ్రువీకరించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు, ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ భూకంపం భూమి అంతర్భాగంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులోనే కేంద్రీకృతమై చోటుచేసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
సాధారణంగా భూమి ఉపరితలం నుంచి 700కిలోమీటర్ల లోతు వరకు ఏ ప్రాంతంలోనైనా భూకంపాలు సంభవించే అవకాశం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ లోతులో వచ్చేవని సాంకేతికంగా ‘అల్ప లోతు భూకంపాలు’గా పరిగణిస్తారని, ఇవి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వల్ల తీవ్రమైన కంపనాలను కలిగిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, భారీ ఆస్తి నష్టం గానీ సంభవించలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.
ప్రకంపనలు సంభవించిన వెంటనే స్థానిక యంత్రాంగం, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాయి. ఎక్కడా భవనాలు కూలినట్లు గానీ లేదా మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు గానీ సమాచారం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, హిమాలయ పర్వత ప్రాంతం నిరంతరం టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల అత్యంత సున్నితమైన భూకంప ముప్పు మండలంగా (సెస్మిక్ జోన్) పరిగణించబడుతోంది.
తక్కువ లోతులోనే ఈ రకమైన తీవ్రతతో ప్రకంపనలు రావడం వల్ల ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు కొంత సమయం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతానికైతే పరిగణించదగిన నష్టమేమీ జరగలేదని ఎన్‌సీఎస్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో తరుచూ ఇలాంటి చిన్నపాటి భూకంపాలు నమోదవుతుంటాయని, సున్నితమైన ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని విపత్తు నిర్వహణ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
https://x.com/NCS_Earthquake/status/2087703513522639221?s=20












