పూజలో దీపం వెలిగించడం అంటే కేవలం చీకటిని తొలగించడం కాదు.. మనసులోని అజ్ఞానాన్ని తొలగించి, దైవ చైతన్యాన్ని ఆహ్వానించే పవిత్రమైన ఆచారంగా హిందూ సంప్రదాయం భావిస్తుంది. అయితే దీపారాధనలో ఉపయోగించే నూనె లేదా నెయ్యికి కూడా ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి..
ముందుగా ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. అత్యంత పవిత్రమైనదిగా భావించే నెయ్యి దీపాన్ని దేవతారాధన, లక్ష్మీపూజ, విష్ణుపూజ వంటి సందర్భాల్లో వెలిగించడం శుభప్రదమనే నమ్మకం ఉంది. ఈ దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సాత్విక వాతావరణం, శాంతి, దైవానుగ్రహం లభిస్తాయని అంటున్నారు.
మరోవైపు నువ్వుల నూనె దీపం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగినదే. ముఖ్యంగా శని సంబంధమైన ఆరాధనల్లో, దోష నివారణ, ప్రతికూలతలు తొలగాలని కోరుకునే సందర్భాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించే ఆచారం ఉంది. అలాగే కొబ్బరి నూనెతో దీపం దక్షిణ భారత సంప్రదాయాల్లో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. కుటుంబ శ్రేయస్సు, శుభకార్యాలు, దేవతా ఆరాధనలో దీనిని ఉపయోగిస్తారు.
ఇక కొన్ని ప్రాంతీయ సంప్రదాయాల్లో దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు దూరం కావాలని కోరుతూ ఆవ నూనె దీపం ఉపయోగిస్తారు. అయితే ఇది అన్ని సంప్రదాయాల్లో ఒకే విధంగా ఉండదు. మరోవైపు నువ్వుల నూనె, నెయ్యి రెండింటినీ కలిపి దీపం వెలిగించడం కొన్ని ఆచారాల్లో కనిపించినప్పటికీ, ప్రతి ఇంటి పూజా సంప్రదాయం, ఆరాధించే దేవత, కుటుంబ ఆచారం వేర్వేరుగా ఉండొచ్చు.
ఇక ఫలానా నూనె వాడితే ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాదు. ఇవన్నీ మన పూర్వీకుల ఆధ్యాత్మిక సంప్రదాయాలు, విశ్వాసాలకు సంబంధించిన అంశంగా పండితులు పేర్కొంటున్నారు. అసలు దీపారాధనలో ముఖ్యమైనది నూనె కంటే భక్తి, శ్రద్ధ, పరిశుభ్రత, పవిత్రత, నిస్వార్థమైన సంకల్పం అని చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












