టాప్ న్యూస్

దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేయలేరు.. ఖమ్మం సభలో కేసీఆర్‌పై రేవంత్ ఫైర్!.

రచన: Venu7 నిమిషాల పఠనం

మళ్ళీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలును కురుక్షేత్రంతో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి.. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయల నుండి శాశ్వతంగా పంపించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు నిద్రపోరని హెచ్చరించారు.

ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని పేర్కొన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2023 జూలైలో కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను బొంద పెట్టారని గుర్తు చేశారు.

అదే జూలై నెలలో ఇప్పుడు మరోసారి చింతకాని సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్‌ కు ఇక ఇక్కడ స్థానం లేదనే సంకేతం ఇచ్చారని అన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలిచారని, పాపాల భైరవుడిని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

మళ్ళీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కురుక్షేత్రంతో పోల్చిన సీఎం, కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయల నుండి శాశ్వతంగా పంపించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విరామం తీసుకోరని స్పష్టం చేశారు. అలాగే వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో కాకుండా 2029 మే లేదా జూన్ నెలల్లో జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 పార్లమెంట్ స్థానాలు 26కు, 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని పేర్కొన్నారు.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీరాముడి సాక్షిగా ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల సంకల్పమని పేర్కొన్నారు.

దొంగ సర్వేలు, దొంగ ఏజెన్సీలతో బిఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తాము రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నామని తెలిపారు..రైతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందన్న సీఎం.. బీఆర్ఎస్‌లో నెలకొన్న కుటుంబ కలహాలతోనే దొరలకు వారి బిడ్డలకు సమయం సరిపోతుందని.. ఇక ప్రజల కోసం ఆలోచించే తీరిక వారికి ఎక్కడ ఉందని విమర్శించారు.

ఒకరిపై ఒకరు పోటీగా కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటున్నారు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది… మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం ప్రాంతం మునిగే ప్రమాదం ఉందనే ఆలోచన వారికి ఎందుకు తట్టడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో 44 గ్రామాలు వరదలతో నష్టపోయాయని గుర్తుచేస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడకూడదన్నారు.

తనపై తప్పుడు సర్వేల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన సీఎం, ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారు కాకముందే, రిజర్వేషన్ల వ్యవస్థ ఎలా మారుతుందో తెలియకముందే సర్వేలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. గతంలో జూబ్లీహిల్స్‌లో కూడా ఇలాంటి ప్రచారాలను ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు.

మరో వైపు హరీష్ రావు పార్టీ మారుతారనే వార్తల నేపథ్యంలో.. తాను బీజేపీలోకి వెళ్లనని కేసీఆర్‌పై ఒట్టు వేసి చెప్పాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలకే స్పష్టత లేదని, ఆ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనే చర్చలు వారి కుటుంబ సభ్యుల నుంచే వస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని సీఎం గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నామని వివరించారు.

రైతు భరోసా సాయాన్ని 12 వేల రూపాయలకు పెంచామని, రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను చేశామని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణకు పెరగనున్న 26 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 20 స్థానాలను కాంగ్రెస్ గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరిక మేరకు మధిర నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చివరగా సభలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి “ఔర్ ఏక్ బార్... కాంగ్రెస్ సర్కార్” అంటూ రేవంత్ రెడ్డి నినాదం చేశారు.

#Khammam#meeting#cm Revanth reddy#congress#brs#KCR#raithu aasirvada sabha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి