టాప్ న్యూస్

భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారిన ఉత్తరాది.. రెడ్ అలర్ట్‌తో అప్రమత్తమైన రాష్ట్రాలు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

మనిషి ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు తట్టుకుని నిబడలేడని ఎన్నో సంఘటనలు నిరూపించాయి.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు క్షణాల్లోనే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి.

మనిషి ఎంత అభివృద్ధి సాధించినా ప్రకృతి ముందు తట్టుకుని నిబడలేడని ఎన్నో సంఘటనలు నిరూపించాయి.. భారీ వర్షాలు, వరదలు, కొండచరియల విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు క్షణాల్లోనే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తాయి. ఒకవైపు ప్రాణనష్టం, మరోవైపు ఆస్తినష్టం వంటివి సంభవిస్తాయి.. ప్రకృతి కన్నెర్ర చేస్తే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు కళ్ళముందు వార్తలుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్, కుషీనగర్, బులంద్‌షహర్, షామ్లీ, ఘాజియాబాద్ జిల్లాల్లో పలువురు మృతిచెందారు. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల రహదారులు పూర్తిగా నీట మునిగిపోయాయి.

దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గుజరాత్‌లోని సూరత్ నగరంలో రోడ్లు జలమయమై వాగులను తలపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇప్పటికే కురిసిన వర్షాలకు అలకనంద, మందాకిని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తాజా హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అలాగే 29 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు.. వర్షాలు, బలమైన గాలుల కారణంగా పనిచేయకుండా పోయాయి. భారీ వర్షాల కారణంగా ప్రముఖ చార్‌ధామ్ యాత్రకు కూడా అంతరాయం ఏర్పడింది. ఉత్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేను తాత్కాలికంగా మూసివేశారు.

ఉత్తరప్రదేశ్‌లో కూడా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఘాజియాబాద్, మీరట్, హాపూర్, బులంద్‌షహర్, బాఘ్‌పత్, ముజఫర్‌నగర్, మొరాదాబాద్ జిల్లాల్లో ముందస్తు చర్యగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఇక మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు.

#national#india#heavy-rain#north-states#up#himachalpradesh#maharastra#Red Alert
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి