ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్.. సియోల్‌లో జరిగిన కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ (కేఏఐసీఏ) రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన "సుస్థిర ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0"ని వివరిస్తూ, ఏపీలో విస్తరిస్తున్న ఈవీ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు కావాలని కొరియన్ దిగ్గజ సంస్థలను ఆయన ఆహ్వానించారు. నాడు అనంతపురంలో కియా మోటార్స్ సాధించిన విజయమే తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి ఈ సమావేశంలో వెల్లడించారు. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో విద్యుదీకరించడంతో పాటు, గ్రీన్ కారిడార్లలో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే పుంగనూరులో ప్రత్యేక ఈవీ క్లస్టర్‌ను, ఈవీ బ్యాటరీల ముడిసరుకు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక 'రేర్ ఎర్త్ కారిడార్'ను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో ఇప్పటికే కియా, అశోక్ లేలాండ్, ఇసుజు, అమర్ రాజా వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయని.. ప్రస్తుతం అశోక్ లేలాండ్ సంస్థ రూ. 2,500 కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ ఈ-బస్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందని లోకేశ్ వివరించారు.
కొరియన్ కంపెనీల పెట్టుబడులకు అనుగుణంగా కియా క్లస్టర్ సమీపంలో ఒకటి, శ్రీసిటీ-చిత్తూరు-తిరుపతి కారిడార్‌లో మరొకటి చొప్పున రెండు ప్రత్యేక ఆటో కాంపోనెంట్స్ పార్కులను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీటిలో ప్లగ్-అండ్-ప్లే షెడ్లు, ఉమ్మడి టెస్టింగ్ సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా ఒక 'కొరియా డెస్క్'ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమలకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం గల మానవ వనరులను అందించేందుకు ఏపీఎస్ఎస్‌డీసీ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇరు ప్రాంతాల మధ్య వ్యాపార సంబంధాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ఆధ్వర్యంలో ఒక ఉమ్మడి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.












