నాగర్‌కర్నూల్ జిల్లా, తిమ్మాజిపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యాబోధన పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా, బడుగు బలహీన వర్గాల బాలికలకు నాణ్యమైన విద్య అందించాల్సిన ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు కారణంగా విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గురువారం రోజున పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థినులు ఉండగా, బోధన కోసం ఒక్క మ్యాథ్స్ టీచర్ మాత్రమే విధులకు హాజరయ్యారు. మొత్తం 11 మంది టీచింగ్ స్టాఫ్‌లో మిగతా 10 మంది తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సోషల్, PET, ANM, కంప్యూటర్ టీచర్లు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. ఇద్దరు అటెండర్లు , 5 మంది వంటమనుషులు కూడా డ్యూటీకి రాలేదు.
దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులకు ఒక్క ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఉండగా ఒక్క టీచర్‌తో బోధన నిర్వహించడం ఇక్కడి వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో తెలియచేస్తుంది. అంతేకాకుండా ఇద్దరు అటెండర్లు, ఐదుగురు వంట సిబ్బంది కూడా విధులకు హాజరు కాకపోవడంతో పాఠశాల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంత అధ్వానంగా నిర్వహిస్తున్న ఈ పాఠశాల విద్యార్థినుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ కమిషన్, జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు కూడా అందినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇదే పాఠశాలలో చదువుతున్న కుమ్మర గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ఈ నెల మూడో తేదీన పాఠశాల గోడ దూకి ఇంటికి వెళ్లిపోయిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వారు పాఠశాలలో లేరనే విషయాన్ని సిబ్బంది గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగో తేదీన విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తిరిగి పాఠశాలకు తీసుకొచ్చిన తర్వాతే ఈ విషయం బయటపడిందని తెలుస్తోంది.
ప్రభుత్వం బాలికల విద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేజీబీవీ పాఠశాలల పరిస్థితి ఇలా ఉండటం బాధాకరమని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యాబోధన, పర్యవేక్షణ, భద్రత వంటి అంశాల్లో నెలకొన్న లోపాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












