కొడుకు దూరమైన బాధలో ఉన్న ఆ తండ్రి కోడలి భవిష్యత్తును ఆలోచించాడు. కన్నకూతురిలా ఆమెను గుండెలకు హత్తుకుని, ఆమెకు పునర్వివాహం జరిపించాడు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. సమాజంలో వితంతువుల పట్ల ఉన్న మూస ధోరణులను బద్దలు కొడుతూ.. భోపాల్‌కు చెందిన దినేష్ వైరాగి అనే వ్యక్తి మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచారు.
భోపాల్‌కు చెందిన దినేష్ వైరాగి కుమారుడు క్యాన్సర్ మహమ్మారి కారణంగా మృతిచెందాడు. కొడుకు అకాల మరణం చెందడంతో ఆయన కోడలు వితంతువుగా మిగిలిపోయింది. అయితే, ఆమెను అనాథగా వదిలేయడానికి ఆ కుటుంబం ఇష్టపడలేదు. కోడలికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావించిన దినేష్.. ఆమెకు తగిన వరుడిని వెతికి, ఇటీవల భోపాల్‌లో ఘనంగా వివాహం జరిపించారు.
ఈ పెళ్లి వేడుకలో కన్నతండ్రి స్థానంలో నిలబడిన మామగారే స్వయంగా కన్యాదానం ఘట్టాన్ని నిర్వహించి, పెళ్లికి వచ్చిన వారందరినీ కదిలించారు. కొడుకు పోయిన ఏడాదిలోనే ఇచ్చిన మాట ప్రకారం వియ్యంకుడికి అండగా నిలబడి ఈ పెళ్లి పూర్తి చేశారు. దినేష్ వైరాగి మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు మరణం తర్వాత కోడలిని మేము కూతురిలాగే చూసుకున్నాం. ఆమె భవిష్యత్తుకు బాటలు వేయడం మా బాధ్యతగా భావించాం.’ అని ఎమోషనల్ అయ్యారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో మరిన్ని కుటుంబాలకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సైతం వైరాగి కుటుంబం చూపిన గొప్ప మనసుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
https://www.instagram.com/reel/DafYKTyjTUe/?utm_source=ig_web_button_share_sheet












