రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని అంటారు. ఇక్కడ బండ్లు ఓడలు అవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి. ఇది నిజమని నిరూపించే ఘటనలు రాజకీయాల్లో కోకొల్లలు.. గత రెండున్నర సంవత్సరాల క్రితం వరకు బిఆర్ఎస్ దే అధికారం.. ఆ సమయంలో వారు ఆడిన ఆటలు, చేసిన మోసాలు అన్నీ ఇన్ని కావని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.
ఈ రాజకీయ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు.
పదేళ్లపాటు అధికారంలో ఉండి, కీలక శాఖలను నిర్వహించిన హరీష్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టుల్లో లోపాలు బయటపడుతున్నాయని, వాటిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాజీ మంత్రులదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నాయకులు అసహనానికి గురవుతున్నారని విమర్శించారు.
అదే సమయంలో.. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిపితే.. ఆ అంశాన్ని పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం మహేష్ గౌడ్ మాటలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక వ్యవహారాలపై కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు లేవనెత్తారు. ఒక ప్రాంతీయ పార్టీ ఖాతాల్లో భారీ మొత్తంలో నిధులు ఎలా చేరాయో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, సంబంధిత నేతలు కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పైనా పీసీసీ చీఫ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన వివాదాస్పద అంశాల సమయంలో ఈటల రాజేందర్ అప్పటి అధికార పార్టీలోనే కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రశ్నించని విషయాలపై ఇప్పుడు మాట్లాడటం రాజకీయ అవకాశవాదమేనని మండిపడ్డారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో బీజేపీ విఫలమైందని అన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీ ఏమైందో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర పాలనలో సాధారణ ప్రజలకు కలిగిన ప్రయోజనాలపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన మహేష్ కుమార్ గౌడ్, పార్టీలో కొన్ని చిన్నచిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే వాటిని పార్టీ వ్యవస్థాగతంగా పరిష్కరిస్తోందని చెప్పారు. క్రమశిక్షణ విషయంలో అందరికీ ఒకే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
కడియం శ్రీహరి, కొండా సురేఖకు సంబంధించిన వివాదాలు, అలాగే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ఈ అంశాల పరిశీలన కోసం సీనియర్ నేతలు సచిన్ సావంత్, జగ్గారెడ్డిని అబ్జర్వర్లుగా నియమించామని తెలిపారు. వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పార్టీకి నివేదిక సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి పెరుగుతున్న మద్దతుపై కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉందని, అందుకే వివిధ వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఇతర పార్టీలు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకున్నా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు.
చివరిగా పార్టీలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్ పదవుల భర్తీ అంశంపై కీలక ప్రకటన చేశారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్‌తో సమావేశమై కార్పొరేషన్ పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీశాయి. హరీష్ రావుపై చేసిన సవాళ్లు, ఈటల రాజేందర్‌పై విమర్శలు, బీజేపీ హామీలపై నిలదీత, అలాగే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై చేసిన స్పష్టీకరణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.












