టాప్ న్యూస్

వాహనదారుల సందేహాలకు చెక్.. E20 పెట్రోల్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!..

రచన: Venu3 నిమిషాల పఠనం

ఇంధన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఈ20 పెట్రోల్ వినియోగంపై కీలక ప్రకటన చేసింది.

దేశంలో ఇంధన భద్రతను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా పెట్టుకుని ఈ20 పెట్రోల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ 20 అంటే సాధారణ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిశ్రమంగా కలపడం. అయితే ఈ ఇంధనం వాడితే వాహనాల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంగీకరించింది.

అధికారిక సమాచారం ప్రకారం, ఈ20 పెట్రోల్ వాడకంతో మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గవచ్చు. కానీ ఈ చిన్న తగ్గుదల కంటే దేశానికి, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ20 వినియోగం వల్ల వాహనాల నుంచి వెలువడే హానికర వాయువులు తగ్గి కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుంది. అంతేకాదు, ఇంజిన్ పనితీరు మెరుగుపడటంతో పాటు వాహనాల పికప్ కూడా మరింత బాగుంటుందని కేంద్రం పేర్కొంది.

పర్యావరణ హిత ఇంధనంగా ఈ20 భవిష్యత్తులో కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు బయోఫ్యూయల్ విధానంతో దేశంలో స్వదేశీ ఇంధన భద్రత గణనీయంగా పెరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ20 పెట్రోల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది.

దీనివల్ల విదేశీ మారకద్రవ్య వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా ఈ20 ఇంధనాన్ని హడావుడిగా తీసుకురాలేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2001 సంవత్సరం నుంచే ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించిన తర్వాతే దశలవారీగా అమలు చేస్తున్నామని వెల్లడించింది.

మొత్తానికి, స్వల్ప మైలేజీ తగ్గుదల ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన భద్రత, విదేశీ చమురు దిగుమతుల తగ్గింపు వంటి అనేక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ20 పెట్రోల్ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

#national#india#motorists#Biofuel#e20-petrol#bjp#doubts
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి