తెలంగాణ

కాళేశ్వరం పై ఈటెల కత్తిలాంటి మాటలు!..

రచన: Venu5 నిమిషాల పఠనం

తెలంగాణలో రాజకీయాలు గడియ గడియకు హీట్ ఎక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు నాన్ స్టాప్ గా పేలుతున్నాయి. ప్రస్తుత విమర్శలు సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా మారాయి.

తెలంగాణలో రాజకీయాలు గడియ గడియకు హీట్ ఎక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు నాన్ స్టాప్ గా పేలుతున్నాయి. ప్రస్తుత విమర్శలు సాగునీటి ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా మారాయి. ఒకవైపు హరీష్ రావు – కాంగ్రెస్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతుంటే.. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఎంట్రీతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది.

తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్ట్స్.. వ్యక్తిగతం లాస్ట్ అంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. రైతుల ప్రయోజనాల విషయంలో ఎవరినీ వదిలిపెట్టనని స్పష్టం చేసిన ఈటెల.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తున్నా.. మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలోనూ సాగునీరు కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద ఉన్న రైతుల కష్టాలను ప్రస్తావిస్తూ.. నీళ్లు లేకపోతే బోర్లు, బావులే ఆధారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయాల కోసం కాదని.. నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసం జరిగిందని గుర్తు చేశారు. పార్టీలు మారొచ్చు.. నాయకులు మారొచ్చు.. కానీ తెలంగాణ ప్రయోజనాలు మాత్రం మారకూడదన్న ఎంపీ.. మేడిగడ్డలో సమస్యలు వచ్చాయని మొత్తం కాళేశ్వరాన్నే తప్పుబట్టడం సరికాదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయని, ఇవన్నీ కాళేశ్వరంలో భాగమని గుర్తు చేశారు.. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు అంటే.. లక్ష కోట్లు తిన్నట్టేనా? అంటూ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు..

వందల కిలోమీటర్ల కాలువలు, పైప్‌లైన్లు, భారీ మోటార్లు, టన్నెల్స్‌తో నిర్మించిన ప్రాజెక్టును రాజకీయ కోణంలో మాత్రమే చూడొద్దన్నారు. రైతులకు నీళ్ళు అందించే విషయాన్ని పక్కపెట్టి.. సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని ప్రజా ప్రభుత్వం పై మండిపడ్డారు. సమస్యలను విమర్శిస్తూ కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధి జరగదని, సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. పారదర్శక పాలన చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని హితవు పలికారు.

తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డగా తాను ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నాను, కొట్లాడుతున్నానని ఈటెల క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో సాగునీటి ప్రాజెక్టులపై మాటల యుద్ధం మరోసారి పీక్స్‌కు చేరింది. రైతుల ప్రయోజనాల పేరుతో మొదలైన ఈ పోరు.. రాబోయే రోజుల్లో మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#telangana#political#bjp#Etela Rajender#Kaleshwaram#Congress#revanthreddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి