సిఎం ఆర్ డబ్బులను ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించిన మిల్లర్లు
ఆర్ఆర్ యాక్ట్ కింద నోటీసులిచ్చిన స్పందన కరువు
ఏండ్లు గడుస్తున్న సొత్తు రికవరీ లో అధికారుల నిర్లక్ష్యం
మెదక్ జిల్లాలో 14 డిఫాల్ట్ రైస్ మిల్లులు
బియ్యం దొంగలపై కలెక్టర్ ఏ విదంగా స్పందిస్తుందో!
మెదక్ జిల్లాలో కొందరు రైస్ మిల్లర్ల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అధికారుల అండ, పర్యవేక్షణ లోపంతో సర్కారుకు కుచ్చుటోపీ పెట్టి రూ..కోట్లు వెనకేసుకున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్)కోసం ప్రభుత్వం ఇచ్చిన దాన్యాన్ని బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాల్లో అమ్మేశారు. వచ్చిన డబ్బులను రియల్ ఎస్టేట్ తో పాటు ఇతర వ్యాపారాల్లోకి మళ్ళించిన రైస్ మిల్లర్లు రూ వందల కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.
మిలర్లకు రికవరీ యాక్ట్ నోటీసులు పంపగా ముగ్గురు రైస్ మిల్లర్లు కొన్ని డబ్బులు మాత్రమే చెల్లించి చేతులెత్తేశారు. మిగితా వాళ్ళు ఏండ్లు గడుస్తున్న చెల్లించకుండా మొండికేస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చోరువ తీసుకుంటే సిఎంఆర్ డబ్బులు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జిల్లా ఏర్పడినప్పటి నుంచి సివిల్ సప్లై శాఖ లో పని చేసిన అధికారులు రూ.. కోట్ల లో డబ్బులు సంపాదించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
14 రైస్ మిల్లులు.. బకాయిలు రూ 228.40 కోట్లు
మెదక్ జిల్లాలో సుమారు 160రైస్ మిల్లులు ఉండగా వాటిలో 14 మంది మిల్లర్లు సిఎంఆర్ కు ఇచ్చిన దాన్యాన్ని దారి మళ్ళించి డిఫాల్టర్ లు గా తేలారు. ఒక్కొక్క రైస్ మిల్లు యొక్క బకాయిలను పరిశీలిస్తే పాపన్నపే మండలం నార్సింగి లోని శ్రీ భార్గవ రైస్ ఇండస్ట్రీస్ 1,58,51,004.48రూపాయలు, మసాయిపేట లోని శ్రీ చైతన్య రైస్ మిల్ 4,98,25,632.62రూపాయలు, శివంపేట మండలం కొత్తపేట్ గ్రామంలోని శ్రీ లక్ష్మి రైస్ మిల్ 5,26,32,317.85 రూపాయలు, నర్సాపూర్ లోని శ్రీపాద రైస్ ఇండస్ట్రీస్ 17,49,92,343.67 రూపాయలు, నర్సాపూర్ లోని శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ 36,05,71,744.80 రూపాయలు, నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ లోని శ్రీ శివ సాయి రైస్ ఇండస్ట్రీస్ 20,38,40,995.00 రూపాయలు, రామాయంపేట మండలం కాట్రియాల్ లోని భవాని బిన్ని రైస్ మిల్ 16,14,80,783.61,హవేలి ఘనపూర్ మండలం వాడి గ్రామంలోని శారద ట్రేడర్స్ 5,08,35,878.53:రూపాయలు..
నర్సాపూర్ లోని శ్రీ సాయి కృప ట్రేడర్స్ 1,01,22,909.98 రూపాయలు, హవేలి ఘనపూర్ మండలంలోని సర్థన గ్రామంలో గల చాముండేశ్వరి ట్రేడర్స్ 7,52,71,258.13రూపాయలు, మెదక్ మండలం పాతూర్ లోని సాయి సంతోషి రైస్ ఇండస్ట్రీస్ 49,43,46,130.09 రూపాయలు, నర్సాపూర్ లోని మహాలక్ష్మి రైస్ మిల్ 28,28,82,968.02 రూపాయలు, నర్సాపూర్ లోని వీరభద్ర రైస్ ఇండస్ట్రీస్ 28,28,82,968.02 రూపాయలు, హవేలి ఘనపూర్ లోని వీరభద్ర ఇండస్ట్రీస్ 6,86,54,396.78 రూపాయలు ఏండ్ల తరబడిగా బకాయిలు ఉన్నాయి.
14 మిల్లుల మొండి బకాయిలు మొత్తం కలిపి రూ 228,40,91,351.58 కోట్లు ఉన్నట్టు తేలింది. వందల కోట్ల రూపాయల బియ్యం బకాయిలు ఉన్నా సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్ అధికారులు సంబంధిత మిల్లర్ల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చేతులెట్టేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని డిఫాల్ట్ రైస్ మిల్లులు దశాబ్దా కాలం పాటు బకాయిలు ఉన్నట్లు సివిల్ సప్లై అధికారులు వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి.
బియ్యం దొంగలపై కలెక్టర్ ఏలా స్పందిస్తుందో!
ఏండ్ల తరబడి ప్రభుత్వానికి చెల్లించాల్సిన వందల కోట్ల రూపాయల బియ్యం దొంగలపై.. కలెక్టర్ ప్రతిమా సింగ్ ఏ విదంగా స్పందిస్తుందోనని ప్రజా సంఘాల నేతలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయలు రికవరీ పై కలెక్టర్ స్పందించి డబ్బులు రికవరీ చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన, రిటైర్డ్ అయిన రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులు మిలర్లకు వత్తాసు పలికి కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. వారిపై ఏసీబి తరహా తనిఖీ లు చేపడితే వందల కోట్ల ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మొండి బకాయిలపై సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ సిఎంఆర్ బకాయిలు వసూలు చేస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. మంత్రి ఆదేశాలను పాటిస్తారా? లేదంటే బేఖాతరు చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే..












