క్రైమ్

హీరోను చేస్తానంటూ మోసం.. ప్రముఖ దర్శకుడిపై కేసు

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

'పిల్ల జమీందార్', 'భాగమతి' వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు జి.అశోక్ కుమార్ (అశోక్ బాబు)పై కేసు నమోదైంది.

 'పిల్ల జమీందార్', 'భాగమతి' వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు జి.అశోక్ కుమార్ (అశోక్ బాబు)పై కేసు నమోదైంది. తన కుమారుడిని వెండితెరకు హీరోగా పరిచయం చేస్తానని, అలాగే సదరు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పిస్తానని నమ్మబలికి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారంటూ ఓ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) పోలీసులు కేసు నమోదు చేశారు.

 బాధితుడు హనుమంతరావు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శకుడు అశోక్ 2024 నుంచి 2026 జనవరి మధ్య కాలంలో పలు దఫాలుగా సుమారు రూ.3.5 కోట్లు తీసుకున్నారు. అయితే ఎంత కాలం గడుస్తున్నా సినిమా నిర్మాణం ప్రారంభం కాకపోవడం, మరోవైపు ఇచ్చిన డబ్బును వెనక్కి ఇవ్వడానికి నిరాకరించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ మోసంపై రంగంలోకి దిగిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

 ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం నాడు దర్శకుడు అశోక్‌తో పాటు ఆయన భార్య విజయను, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతరులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించారు. బాధితుడి నుంచి వసూలు చేసిన నగదు ఎక్కడికి బదిలీ అయిందనే కోణంలో 'మనీ ట్రయల్' ఆధారాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి కేసు దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతంలో 'ఉషోదయం' సినిమాకు గానూ ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా నంది అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు ఈ ఆర్థిక వంచన ఆరోపణలతో వార్తల్లో నిలవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది.

#Tollywood#Fraud#Cyberabad#Investigation#Tollywood Director#Extortion
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి