ఖజానాకు చిల్లుపెట్టే కింగులకే అందలం
అవినీతితో పక్కన పెట్టినా మళ్లీ కీలక పదవులు
6 వేల కోట్ల అదాయం చూపించి సెటిల్మెంట్స్ చేసిన వైనం
ఏటా 15 వేల కోట్ల వరకు జీరో దందాగా అనుమానం
అదాయం సమకూర్చే నాలుగు శాఖల్లో అదే తీరు
పేర్లతో పాటు భయటపెడుతున్న స్వేచ్ఛ న్యూస్
గతంలో ఓ మెగా కంపనీకి 30 కోట్లకు నోటీసులు
10 కోట్లు నొక్కేసిన ఘటనలో సీఎం సీరియస్ కావడంతో కమిషనర్ బదిలీ
మొన్న రెవెన్యూ, నిన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్ ల బదీలీ
తాజాగా కమర్షియల్ శాఖ అధికారుల పై ఇన్వెస్టిగేషన్ కథనం.
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
స్వేచ్ఛ చైర్మన్. 9848070809
ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడున్నారని ఏసిబి రోజుకు కనీసం ఇద్దరిని రెడ్ హాండెడ్ గా పట్టుకుంటుంది. అదాయానికి మించిన అస్తుల కేసులో అయితే ఎవ్వరూ వంద కోట్లకు తక్కువ సంపాదించలేదు. అలాంటి ఉద్యోగుల పై స్వేచ్ఛ న్యూస్ నిరంతరం నిఘా ఉంచుతుంది. కీలక ప్రాంతాల్లో పదువులు పొందడానికి 20 లక్షలకు పైగానే లంచాలుగా ఆశ చూపించి ఆదాయం వచ్చే ప్రాంతాన్ని ఎంచుకొని నిత్యం అవినీతికి పాల్పడుతున్నారు. ఏసిబి దాడులు జరిగితే కానీ ఈ నిజాలు బయటపడని పరిస్థితి నెలకొంది. అందుకే స్వేచ్ఛ ముందే బదిలీల్లో ఎవ్వరెవరు చక్రం తిప్పుతున్నారో వారి పేర్లతో సహా వారి అవినీతిని భయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. విశ్వసనీయతమైన సమాచారంతోనే రాస్తుంది. ఎక్కడో ఒక్కవద్ద ఈ అవినీతి, లంచాలు అగుతాయని ఆశ మాత్రమే. ప్రజలకు నాణ్యమైన సర్వీస్, ప్రభుత్వానికి అదాయం సమకూర్చేలా పనిచేస్తారని తాము స్వేచ్ఛయుతంగా, ధైర్యంగా సత్యాలే వార్తలుగా రాస్తున్నాం.
కమర్షియల్ లో కలెక్షన్ కింగ్స్..
వాణిజ్య పన్నుల శాఖలో కలెక్షన్ కింగ్‌లు అధికమయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ అదనపు కమిషనర్‌ను కొందరు అధికారులకు నమ్మి పెత్తనం అప్పగిస్తే ప్రతిరోజు లక్షల రూపాయలను వారు వెనుకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ విఆర్‌ఎస్ తీసుకున్న తరువాత కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీగా రఘునందన్‌రావు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు నమ్మకస్థులైన ఇద్దరు అడిషనల్ కమిషనర్‌లకు బాధ్యతలు అప్పగించారు. గతంలోనే వారిపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో వారిని గత ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్‌లు పక్కన బెట్టారు. అయినా, ప్రస్తుత కమిషనర్ రఘునందన్ రావు ఈ ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించడంపై ఆ శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ జేసిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి సైతం ప్రస్తుతం కలెక్షన్‌కింగ్ మారారని, ఈ ముగ్గురు చెప్పిందే ప్రస్తుతం ఈ శాఖలో శాసనమని, వారిని ప్రసన్నం చేసుకుంటే పనిజరుగుతుందని ఉద్యోగులు, వ్యాపారులు పనికోసం వారి వద్దకు క్యూ కడుతుండడం గమనార్హం.
ముగ్గురు జేసిలు, ఒక అడిషనర్ కమిషనర్
ఈ మధ్య జరిగిన బదిలీల్లోనూ అనేక అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. గతనెల జూన్01వ తేదీన జరిగిన ఈ బదిలీల్లో ముగ్గురు జేసీలు కానూరి రవి, రాజాకృష్ణ, అరవింద్‌రెడ్డిలతో పాటు వీరికి తోడుగా మరో అదనపు కమిషనర్ చక్రం తిప్పారని, ఒక హోటల్‌లో కూర్చొని ఈ బదిలీల జాబితాను తయారు చేశారని, ఒక్కో పోస్టుకు రూ.30 నుంచి రూ.50 లక్షలను వసూళ్లు చేశారని, కొన్ని డివిజన్‌ల కోసం వేల పాటలను సైతం నిర్వహించినట్టుగా తెలిసింది. కలెక్షన్ ఎక్కువగా వచ్చే డివిజన్‌ల కోసం పలువురు జేసిలు వేలం పాటలో పోటీపడ్డట్టుగా తెలిసింది.
లాబీయింగ్ చేసి మంచి పోస్టింగ్‌లు
ముఖ్యంగా ఫ్యూచర్‌సిటీ, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, గోల్కొండ, బేగంపేట్, నల్లగొండ, చార్మినార్, కుత్భుల్లాపూర్, ఖైరతాబాద్, ఎల్‌భినగర్, శంషాబాద్‌ల కోసం వేలం పాటలు జరిగినట్టుగా తెలిసింది. ఈ బదిలీల్లో కష్టపడిన జేసిలు కానూరి రవి, అరవింద్‌రెడ్డి, రాజాకృష్ణలు లాబీయింగ్ చేసి ఈ బదిలీలను సక్సెస్ చేసినందుకు వారికి మంచి పోస్టింగ్‌లు పొందారని ఆ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మాదాపూర్ డివిజన్ నుంచి శేరిలింగంపల్లి డివిజన్‌కు అరవింద్‌రెడ్డి, ఆబిడ్స్ డివిజన్ నుంచి గోల్కొండ డివిజన్‌కు కానూరి రవి, ఎన్‌ఫోర్స్‌మెంట్ జేసిగా రాజాకృష్ణలు ప్రస్తుతం బదిలీ అయ్యారు. రాజాకృష్ణ భార్య కూడా రెండేళ్లుగా బేగంపేట్ డివిజన్ జేసిగా పనిచేస్తుండగా ప్రస్తుతం ఆమెను మళ్లీ అక్కడికే బదిలీ చేయడం విశేషం.
షాడో కమిషనర్‌గా వ్యవహారిస్తున్నా
ఇక, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌కు ప్రధాన అనుచరులైన ఒక అడిషనల్ కమిషనర్ స్టేషనరీ నుంచి బదిలీల వరకు ఆ అధికారిదే పెత్తనమని కమిషనర్ తనకు క్లోజ్ అని అందరినీ బెదిరిస్తుండడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ అధికారిపై భారీగా ఫిర్యాదులు వచ్చినా, షాడో కమిషనర్‌గా వ్యవహారిస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా ఆ అదనపు కమిషనర్‌పై ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జేసిపై యాక్షన్ తీసుకోకుండా అడ్డుకున్న మంత్రి
ప్రస్తుతం గోల్కొండ జేసిగా పనిచేస్తున్న కానూరి రవి గతంలో ఒక ఉన్నతాధికారితో కలిసి వ్యాపారులకు నోటీసులు ఇచ్చి భారీగా ముడుపులు వసూళ్లు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించిన సిఎం వెంటనే ఆ ఉన్నతాధికారిని వేరే జిల్లాకు బదిలీ చేయడంతో పాటు ఈ జేసిపై యాక్షన్ తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే, ఆయపై చర్యలు తీసుకోవాలని ప్రస్తుత కమిషనర్ భావించినా ఒక మంత్రి ఆయన్ను మార్చకుండా అడ్డుకున్నారని ఆబిడ్స్ డివిజన్ (ప్రస్తుతం గోల్కొండ డివిజన్‌గా పేరు మర్చారు) ఇవ్వాలని కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చినట్టుగా తెలిసింది. ఓ కంపెనీ నుంచి ఆనాటి కమిషనర్ తో కలిసి ఓ మేగా కంపెనీకి రూ.30 కోట్లకు నోటీసులు ఇచ్చి రూ.10 కోట్లు వసూలు చేసినట్టుగా ముఖ్యమంత్రి ఫిర్యాదులు అందడంతో అప్పటి కమిషనర్‌పై బదిలీ వేటు పడ్డట్టుగా సమాచారం.
78 నుంచి 82 వేల కోట్లకు అదాయం పెంపు.? ఇంకా రావాల్సి ఉండే ?
బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కమర్షియల్ టాక్స్ లో భారీగా కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కేసులు సైతం నమోదు చేశారు. ఏం జరిగిందో కానీ ఇప్పటికి చాలామందికి శిక్షలు పడలేదు. రఘనందన్ రావు ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.78 కోట్ల ఆదాయాన్ని ఏటా రూ.82 కోట్లకు పెంచారు. కానీ, ఇదంతా పూర్తి స్థాయి వ్యాపారులు చెల్లించిన జీఎస్టీ తోనే సాధ్యమయింది. చాలా కంపెనీలు ఇప్పటికీ జీరో దందాలు చేస్తుండగా ఆయా కంపెనీలకు ఏసిటిఓ నుంచి జేసి స్థాయి వరకు సహకరించి కోట్ల రూపాయలను వెనుకేసుకుంటున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈ శాఖకు ప్రతి సంవత్సరం రావాల్సిన రూ.10 నుంచి రూ.15 వేల కోట్ల ఆదాయం అధికారులు, వ్యాపారుల జేబుల్లోకి వెళుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని కూడా అరికడితే అధికారుల అవినీతి తగ్గుతుందని నిఘా వర్గాల సమాచారం.












