సైబర్ నేరగాళ్లను ఎంత కట్టడి చేయాలని చూసినా ఏదో ఒక కొంత మోసంతో తిరిగి వస్తున్నారు. మొన్నటివరకు క్రెడిట్ కార్డ్స్, కాల్ స్వాపింగ్, క్యూఆర్ కోడ్ స్కామ్, ట్రాఫిక్ చలాన్లు, రైతు భరోసా ఓటీపీ, డిజిటల్ అరెస్టులు, న్యూడ్ వీడియోస్ మార్ఫింగ్ ఇలాంటి స్కామ్ చేస్తూ వచ్చిన.. సైబర్ కేటుగాళ్లు తాజాగా వాయిస్ క్లోనింగ్ మోసానికి తెరలేపారు.వారికి ఏఐ పవర్ ఫుల్ వెపన్‌లా మారింది. కేవలం 3 నుంచి 5 సెకన్ల పాటు మీ వాయిస్ రికార్డ్ చేయగలిగితే చాలు..
ఏఐ సాఫ్ట్‌వేర్ల సాయంతో అచ్చం మీలాగే మాట్లాడే వాయిస్ మోడల్‌ను నేరగాళ్లు సృష్టించేస్తున్నారు. మీరు మాట్లాడే యాస, శ్వాస తీసుకునే విధానం, భావోద్వేగాలను కూడా ఈ సాఫ్ట్‌వేర్స్ అచ్చుగుద్దనట్టు అనుకరిస్తున్నాయి.దీంతో అవతలి వ్యక్తి మాట్లాడుతున్నది మనిషా లేక యంత్రామా? అని గుర్తుపట్టడం సామాన్యులకు అసాధ్యంగా మారుతోంది.
ముందుగా నేరగాళ్లు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో పోస్ట్ చేసే రీల్స్ లేదా వీడియోల నుంచి మన వాయిస్‌ను దొంగిలిస్తారు. కొన్నిసార్లు అపరిచిత నంబర్ల నుంచి కాల్ చేసి, ఏవేవో ఆఫర్లు ఉన్నాయని నమ్మబలికి మీతో మాటలు కలుపుతారు. ఆ టైంలోనే మీ వాయిస్ రికార్డ్ చేసి, క్లోనింగ్ సాఫ్ట్‌వేర్‌కు ఫీడ్ చేస్తారు. అనంతరం మీ సోషల్ మీడియాలో ఉండే మీ దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల నెంబర్లు, ఐడీలు సేకరిస్తారు.
వారికి మెసేజులు, ఫోన్లు చేయడం ప్రారంభిస్తారు. యాక్సిడెంట్ జరిగిందని, ప్రమాదంలో ఉన్నానని, డబ్బులు పోయాయని, ఫోన్ పోయిందని ఇలా అబద్దాలు చెబుతూ డబ్బులు గుంజుతారు.అందుకే ఎవరైనా సడన్‌గా మెసేజెస్, కాల్స్ చేసి ఇలా డబ్బులు అడినప్పుడు బాధిత వ్యక్తి సొంత నెంబర్‌కు కాల్ చేసి ధ్రువీకరించుకోవాలని లేదా అతనితో నిత్యం ఉండేవారికి కాల్ చేయాలని వెంటనే డబ్బులు పంపరాదని సైబర్ నిపుణులు చెబుతున్నారు.












