క్రైమ్

TG: అర్ధరాత్రి దారుణం.. ఆరుగురిని హతమార్చిన పోక్సో కేసులో నిందితుడు

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. ఏకంగా ఆరుగురిని కిరాతకంగా హతమార్చాడు.

 తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఓ వ్యక్తి ఉన్మాదిలా మారాడు. ఏకంగా ఆరుగురిని కిరాతకంగా హతమార్చాడు. మృతుల్లో కేసు పెట్టిన బాలిక, ఆమె కుటుంబ సభ్యులతో పాటు నిందితుడి సొంత భార్యాపిల్లలు కూడా ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో చోటుచేసుకుంది.

 వివరాల్లోకి వెళితే.. దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్ (28) అనే వ్యక్తి ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడగా, బాధితురాలి తల్లి మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, మే 26న నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అయితే, పోలీసులు కేవలం ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లను మాత్రమే చేర్చడంతో, నిందితుడికి కేవలం రూ.20వేల పూచీకత్తుతో రెండు నెలల్లోనే కోర్టు నుంచి బెయిల్ లభించింది.

 బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్, తనను జైలుకు పంపారన్న కక్షతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో కేసు పెట్టిన బాలికను బలవంతంగా పొలంలోకి తీసుకెళ్లి, ఆమెపై తిరిగి రేప్‌కు ఒడిగట్టి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా, సదరు బాలిక తల్లిని, నానమ్మను కూడా కత్తితో వేటాడి కడతేర్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య సరితతో పాటు, ఇద్దరు కన్నబిడ్డలను సైతం దారుణంగా నరికి చంపేసి ఉన్మాదిగా ప్రవర్తించాడు. మృతులు చిట్యాల రుక్కమ్మ(65) చిట్యాల లక్ష్మి(45), బాలిక(17), భార్య పర్వతి సరిత (30), పిల్లలు పరీక్షిత్(3), దైవిక్షిత్(2)గా పోలీసులు వెల్లడించారు.

నిందితుడే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపినట్లు సమాచారం. కొద్ది సేపట్లో నేను కూడా చచ్చిపోతున్నాను’ అని చెప్పడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతం ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒకేసారి ఆరుగురిని బలితీసుకున్న ఈ కిరాతక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నరమేధంతో షాబాద్ పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొనగా, చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

#Crime#Murder#Tragedy#Telangana#Investigation#Justice#Telanganacrime#shabad#rangareddycrime
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి