తెలంగాణ

'రూ.లక్ష కోట్లు తిన్నామా..? రేవంత్‌రెడ్డికి బుద్ధి ఉండాలి..' ఈటల ఘాటు వ్యాఖ్యలు

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాజెక్టు మొత్తం వ్యయమే లక్ష కోట్ల రూపాయలయితే, అందులో లక్ష కోట్లు ఎలా తింటారని ఆయన ప్రశ్నించారు. "లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ధి ఉందా? కొద్దిగైనా జ్ఞానం ఉండాలి" అంటూ ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 కాళేశ్వరం ప్రాజెక్టు విస్తృతిని వివరిస్తూ.. ఈ ప్రాజెక్టు అంటే కేవలం ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దీని కింద లక్ష్మి(మేడిగడ్డ), అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ వంటి అనేక భారీ బ్యారేజులు, రిజర్వాయర్లు నిర్మితమయ్యాయని గుర్తుచేశారు. వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, భారీ పైప్‌లైన్లు, పదుల సంఖ్యలో భూగర్భ టన్నెల్స్ (సృంగాలు), భారీ పంపింగ్ మోటార్లతో కూడిన సుదీర్ఘమైన వ్యవస్థ ఇదని ఆయన పేర్కొన్నారు.

 కొన్ని వందల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణానికి, విస్తారమైన నెట్‌వర్క్‌కు నిధులు ఖర్చయ్యాయని.. వాటన్నింటినీ విస్మరించి కేవలం రాజకీయ విమర్శల కోసమే మొత్తం నిధులు దుర్వినియోగమయ్యాయనడం సరికాదని ఈటల హితవు పలికారు. ప్రాజెక్టు పరిధిలోని నిర్మాణాలను, వాస్తవాలను గమనించకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కంటే కూడా తన సొంత రాష్ట్ర ప్రయోజనాలే తనకు అత్యంత ప్రాధాన్యమని అన్నారు. తాను పక్కా తెలంగాణ మట్టి బిడ్డనని, బీజేపీ నాయకులు 'దేశం ఫస్ట్.. పార్టీ నెక్స్ట్' అన్నట్లుగా తనకు మాత్రం "తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్" అని ఈటల వ్యాఖానించారు.
తాను ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే రకం కాదని, ఎవరి చేతిలోనూ రిమోట్ కంట్రోల్‌లా మారే వ్యక్తిని కానని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌లను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ ఘాటు విమర్శలు చేశారు. తనకు సొంత వ్యక్తిత్వం, స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నాయని.. ఇతరుల కనుసన్నల్లో పనిచేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నొక్కిచెప్పారు.

#Eatala Rajender#Revanth Reddy#Kaleshwaram Project#Telangana Politics#BJP#Medigadda Barrage
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి