ఇండియాలోనే అత్యంత ధనికుడు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి అమెరికా కోర్టులో హాజరుకానున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో తన మీద నమోదైన ఓ లీగల్ కేసు విషయమై అటెంట్ కానున్నారు. అయితే, గౌతమ్ అదానీ మీద క్రిమినల్ అభియోగాలను పూర్తిగా కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే విషయాన్ని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ ఈ వారంలోనే అమెరికా కోర్టులో ఒక కీలక అఫిడవిట్ సమర్పించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు ఉపసంహరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా? లేదా? అని నిర్ధారించుకోవడానికే న్యాయస్థానం ఈ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి ముందు అదానీ ఇండియాలోని సోలార్ ప్రాజెక్టులను పెద్దఎత్తున చేజిక్కించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలు, అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నారని అమెరికాలో కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. అసలు ఇండియాలో జరిగిన దానికి అమెరికాలో కేసు ఏంటి? అని అందరికీ అనుమానం కలుగచ్చు. అయితే, అదానీ కంపెనీల్లో చాలామంది అమెరికన్ పెట్టుబడి దారులు పెట్టుబడులు పెట్టారు. యూఎస్ చట్టాల ప్రకారం..తమ కంపెనీల్లోని రిస్క్ ఫ్యాక్టర్స్‌ను, లాభనష్టాల వివరాలను ఆదేశ పెట్టుబడిదారులకు అదానీ ముందుగా వెల్లడించలేదనే కారణంతో అదానీపై యూఎస్‌లో కేసు ఫైల్ అయ్యింది.
అమెరికా ప్రభుత్వమే కోర్టులో కేసు వేసింది. తాజాగా ఆ కేసును విరమించుకోవడానికి ఆ దేశ న్యాయశాఖ కోర్టులో పిటిషన్ వేసింది. అదానీపై ఉన్న అభియోగపత్రాన్ని శాశ్వతంగా కొట్టివేయాలని అమెరికా న్యాయశాఖ కోర్టును అభ్యర్థించింది. ఈ అభ్యర్థనపై తుది తీర్పు ఇచ్చే ముందే, అనగా ఈనెల 15వ తేదీలోపు అదానీ తన ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని అమెరికా న్యాయస్థానం గడువు విధించింది. ఈ అఫిడవిట్‌లో అదానీపై కేసును విత్ డ్రా చేసుకోవడానికి బదులుగా అమెరికా ప్రభుత్వంతో వెనుక ఎలాంటి వాగ్దానాలు, ప్రతిపాదనలు లేదా రహస్య ఒప్పందాలు జరిగాయా? అనే విషయాలను కోర్టు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఈ కేసును కొట్టివేత కోసం ప్రభుత్వానికి లేదా ఇతరులకు ఏదైనా లబ్ధి చేకూర్చారా? వంటి విషయాలను కూడా అఫిడవిట్‌లో పేర్కొనాలి. కాగా, అదానీ సమర్పించబోయే ప్రమాణపత్రం ఆధారంగానే ఈ హై-ప్రొఫైల్ క్రిమినల్ కేసు కొట్టివేతపై అమెరికా న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.












