తెలంగాణ

రైతులకు మళ్లీ ‘యూరియా’ కష్టాలు.. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ!

రచన: Mamatha puppala3 నిమిషాల పఠనం

మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు.

 తెలంగాణలో సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు మళ్లీ ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. తాజాగా మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే వందలాది మంది రైతులు సొసైటీ వద్ద బారులు తీరి, గంటల తరబడి పడిగాపులు కాశారు.

 రైతుల సంఖ్య భారీగా ఉండటం, డిమాండ్‌కు సరిపడా నిల్వలు లేకపోవడంతో ఎరువుల బస్తాల కోసం కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎలాంటి తోపులాటలు జరగకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక పోలీసుల సహాయంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసుల పర్యవేక్షణలోనే రైతులకు టోకెన్లు ఇచ్చి క్రమపద్ధతిలో యూరియాను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు ఊపందుకున్న తరుణంలో యూరియా దొరక్కపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, పనులను వదులుకుని లైన్లలో నిలబడాల్సి వస్తోందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రామయంపేట మండలంతో పాటు జిల్లా వ్యాప్తంగా సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్ దందాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

##Telangana##Medak##YuriaShortage##Farmers##Ramayampet##FertilizerCrisis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి