విధి నిర్వహణలో కొందరు బీఎల్‌ఓలు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు అప్లికేషన్ ఫామ్స్ పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్రాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే, దీనిని అడ్డం పెట్టుకుని కొందరు ప్రజల నుంచి ఫామ్‌కు ఇంత చొప్పున డబ్బులు వసూళ్లకు పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్‌లో గర్వా జిల్లా సింధూరియా గ్రామంలో తాజాగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. సింధూరియా గ్రామ పరిధిలోని బూత్ నంబర్ 289కి చెందిన బీఎల్‌వో జమీలా బీబీ, ఆమె భర్త మహ్మద్ పర్వేజ్ అన్సారీలు ఎన్యుమరేషన్ ఫారాల వెరిఫికేషన్ కోసం ఒక్కో ఓటరు నుంచి రూ.50 డిమాండ్ చేశారు. సీఈసీ ఉచితంగా పంపిణీ చేస్తే ఫామ్స్‌కు డబ్బులెందుకని గ్రామస్తులు ప్రశ్నించగా.. ‘డబ్బులు ఇవ్వకపోతే మీ ఓటరు దరఖాస్తులు ఉన్నతాధికారులకు పంపం.. మీ పౌరసత్వం రద్దవుతుంది.
మిమ్మల్ని ఇక్కడి నుంచి గెంటేస్టారు’ అంటూ భయపెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొందరు భయపడి డబ్బులు ఇవ్వగా.. మరికొందరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.దీనిపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారుల స్పందించారు. బీఎల్‌వో జమీలా బీబీపై విచారణ జరిపి సస్పెండ్ చేసేందుకు అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.












