తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో 41మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విధితమే. కాగా, తమిళనాడు సీఎం, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నేడు(శుక్రవారం) కరూర్ జిల్లాలకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కరూర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో ఇక్కడ జరిగిన అత్యంత దురదృష్టకరమైన తొక్కిసలాట ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆయన స్వయంగా కలవనున్నారు.
సీఎం రాకను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్, అట్లాస్ కలై అరంగం మైదానం పరిసరాల్లో 5 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటనలో సీఎం విజయ్ ఆనాటి ప్రమాదంలో మరణించిన 41 మంది కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా కలిసి పరామర్శించి వారి అర్హతలను బట్టి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్నారు. గతంలో ఈ బాధితులను కేవలం చెన్నై పిలిపించి మాట్లాడటంపై విమర్శలు రాగా, ఇప్పుడు నేరుగా కరూర్ క్షేత్రస్థాయికి వచ్చి బాధితులకు శాశ్వత భరోసా కల్పించేందుకు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బాధితుల పరామర్శ అనంతరం సీఎం విజయ్ కరూర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కలెక్టరేట్‌లో ప్రభుత్వ సంక్షేమ ఫలాల పంపిణీతో పాటు, కృష్ణరాయపురం పరిధిలోని వానవాసి పంచాయతీలో రూ.1,700 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న భారీ పాదరక్షల తయారీ పరిశ్రమకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కరూర్‌లోని వేలుసామిపురం హైవే వద్ద జరిగిన విజయ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విజయ్‌ను చూసేందుకు ఆ ప్రాంతానికి ఊహించని సంఖ్యలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఆయన రాక దాదాపు ఏడు గంటలు ఆలస్యం కావడంతో జనం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. విజయ్ కాన్వాయ్ రాగానే ఆయన్ను చూసేందుకు జనం ముందుకు దూసుకురావడంతో జరిగిన తీవ్ర తొక్కిసలాటలో ఊపిరాడక, తొక్కుకుంటూ వెళ్ళి మొత్తం 41 మంది మరణించగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.












